Rajat Patidar: రెండు ఐపీఎల్ విజయ కిరీటాలు.. అయినా జాతీయ జట్టులో 'పాటిదార్' కి నో ప్లేస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో పోటీ ఎంత తీవ్రమైందో మరోసారి స్పష్టమైంది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) విజేతగా నిలిపిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారత టీ20 జట్టులో స్థానం లభించలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలు, ఆసియా క్రీడల కోసం బీసీసీఐ తాజాగా ప్రకటించిన టీ20 జట్టులో అతడి పేరు లేకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో ఆర్సీబీకి వరుసగా ట్రోఫీలు అందించిన నాయకుడిగా పాటిదార్ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
వివరాలు
మిడిల్ ఆర్డర్‌లో అద్భుత బ్యాటింగ్..
ముఖ్యంగా 2026 సీజన్‌లో అతడు మిడిల్ ఆర్డర్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి 501 పరుగులు సాధించాడు. 192.69 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడిన అతడు 30 ఫోర్లు, 42 సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చాటాడు. అయినప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీసీసీఐ ప్రధాన ఎంపికదారు అజిత్ అగార్కర్ స్పందించారు. జట్టు ఎంపిక ప్రక్రియలో అనేక మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ల పేర్లను పరిశీలించినప్పటికీ, పరిమిత స్థానాల కారణంగా అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదని ఆయన వివరించారు.
వివరాలు
అగార్కర్ ఏం చెప్పాడంటే..
అగార్కర్ మాట్లాడుతూ, "ఎంపిక సమావేశంలో చాలా మంది ఆటగాళ్ల గురించి చర్చించాం. భారత క్రికెట్‌లో ప్రతిభకు కొరత లేదు. జాతీయ జట్టుకు అర్హత ఉన్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు. అయితే తుది జట్టులో కేవలం 15 మందికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపికైన ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. మేము సమతూకమైన జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాం. అర్హత ఉన్నప్పటికీ కొందరు ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించలేక పోయారు. ఇది పోటీ తీవ్రతను సూచిస్తుంది. భవిష్యత్తులో వారికి కూడా అవకాశాలు లభిస్తాయి. అయితే భారత జట్టులో స్థానం కోసం నిరంతరం మంచి ప్రదర్శన కొనసాగించడం అవసరం" అని చెప్పారు.