ఆర్సీబీకి గట్టి ఎదురుబెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
ఐపీఎల్ 2023 ప్రారంభానికే ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో విల్ జాక్స్ గాయపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లిపోయాడు. డిసెంబర్ లో జరిగిన వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ రూ.3.2 కోట్లకు విల్ జాక్స్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు టీ20 లీగ్‌ల్లో విజృంభిస్తున్న విల్ జాక్స్.. ఆర్సీబీకి బలంగా మారతాడని భావించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు విల్ జాక్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్‌లో ఆడలేదు
విల్ జాక్స్ స్థానంలో బ్రేస్‌వెల్..?
ప్రస్తుతం విల్ జాక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ బ్రేస్‌వెల్‌ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. బ్రేస్ వెల్ కూడా ఇప్పటివరకూ ఐపీఎల్ ఆడకపోవడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ లో ఆడే అవకాశం కనిపించడం లేదు. ఫిటెనెస్ సమస్య కారణంగా భారత్ తో జరిగిన మూడో టెస్టుకి దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ నాకౌట్స్ కు చేరింది. అయితే ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఈ జట్టు ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని తహతహలాడుతోంది.