2026 Asian Games: గురి పెట్టి కొట్టారు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పసిడి పతకం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ రెండో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆరో రోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో కమల్‌జీత్-సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. ఫైనల్‌లో అదరగొట్టిన భారత జోడీ ఫైనల్ పోరు ప్రారంభమైనప్పటి నుంచే కమల్‌జీత్-సురుచి సింగ్ జోడీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. చివరకు భారత ద్వయం 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో భారత్‌కు పసిడి పతకం అందించడంతో పాటు.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పింది.
వివరాలు
సరికొత్త ఏషియన్ రికార్డు
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన ఏషియన్ జంటగా కమల్‌జీత్-సురుచి నిలిచారు.
ఇంతకుముందు ఈ రికార్డు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ కమాలోవ్-నిగినా సైద్‌కులోవా జోడీ పేరిట ఉండేది. వారు 481.3 పాయింట్లు సాధించారు.
తాజా ఫైనల్‌లో 484.6 పాయింట్లు సాధించిన కమల్‌జీత్-సురుచి జోడీ.. ఉజ్బెకిస్థాన్ జంట రికార్డును అధిగమించి కొత్త ఏషియన్ రికార్డును నెలకొల్పింది.
వివరాలు
రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రజతం
మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
ఒకే రోజు షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం దక్కడంతో పతకాల పట్టికలో భారత్ ఖాతా మరింత బలపడింది.
ఈ రెండు పతకాలతో కలిపి ఆసియా క్రీడలు 2026లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కి చేరింది.