Loading...
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డుకు ముప్పు.. బద్దలు కొట్టే సత్తా ఎవరికుంది?
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డుకు ముప్పు.. బద్దలు కొట్టే సత్తా ఎవరికుంది?

Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డుకు ముప్పు.. బద్దలు కొట్టే సత్తా ఎవరికుంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించడం ఒక గొప్ప ఘనత. అలాంటిది ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాళ్లలోనూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచే రికార్డును సొంతం చేసుకోవడం మరో ప్రత్యేకత. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు 11 మంది బ్యాటర్లు మొత్తం 14 సార్లు 200 పరుగుల మైలురాయిని దాటారు. వీరిలో రోహిత్ శర్మ మూడు సార్లు, శుభ్‌మన్ గిల్ రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మార్టిన్ గప్తిల్, ఫఖర్ జమాన్, పాతుమ్ నిస్సాంక, ఇషాన్ కిషన్, గ్లెన్ మాక్స్‌వెల్, హ్యారీ బ్రూక్ ఒక్కోసారి ఈ ఘనత సాధించారు.

వివరాలు

రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డు.. ఇప్పటికీ అగ్రస్థానంలోనే!

వన్డే క్రికెట్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరు రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 264 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ క్రమంలో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచిపోయింది.

ఒక్క వన్డే ఫార్మాట్‌లోనే మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

అతడి 'హిట్‌మ్యాన్‌' విధ్వంసకర బ్యాటింగ్, భారీ స్కోర్లు సాధించే సామర్థ్యం ఈ రికార్డును మరింత ప్రత్యేకంగా నిలిపాయి.

భవిష్యత్తులో ఎవరైనా ఈ రికార్డును అధిగమించగలరా? అనే చర్చ క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది.

వివరాలు

రోహిత్ రికార్డును బద్దలు కొట్టగలడా వైభవ్ సూర్యవంశీ?

ప్రస్తుత ఫామ్, దూకుడైన ఆటతీరును పరిశీలిస్తే టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భవిష్యత్తులో భారీ స్కోర్లు సాధించే సామర్థ్యం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

సహజసిద్ధమైన పవర్‌ హిట్టింగ్‌, మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడే నైపుణ్యం అతడి ప్రత్యేకతలు.

సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచి ఆడే అవకాశం లభిస్తే రోహిత్ శర్మ రికార్డుకు సవాలు విసరగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే రోహిత్‌ 264 పరుగుల రికార్డును అధిగమించడం అంత సులభం కాదు.

దూకుడైన బ్యాటింగ్‌తోపాటు వికెట్‌ను కాపాడుకుంటూ ఎక్కువ ఓవర్లు ఆడటం, పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించడం కూడా కీలకమే.

ADVERTISEMENT

వివరాలు

శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, ఇషాన్ కిషన్‌లకూ అవకాశం!

ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన శుభ్‌మన్ గిల్ కూడా ఈ రికార్డును అందుకునే అవకాశమున్న ఆటగాళ్లలో ఒకడు.

223 నాటౌట్‌, 208 పరుగుల ఇన్నింగ్స్‌లతో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న గిల్‌కు ఎక్కువసేపు క్రీజులో నిలిచి భారీ స్కోర్లు సాధించే టెక్నిక్ ఉంది.

అందువల్ల అతడు రోహిత్ రికార్డుకు చేరువయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. మరోవైపు దూకుడైన స్ట్రైక్ రేట్‌తో ఆడే హ్యారీ బ్రూక్, ఇషాన్ కిషన్‌లను కూడా ఈ జాబితాలో ప్రస్తావిస్తున్నారు.

వీరికి 40 ఓవర్ల పాటు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే భారీ వ్యక్తిగత స్కోర్లు సాధించే సామర్థ్యం ఉందనే అభిప్రాయాలున్నాయి.

ఇటీవల శ్రీలంకపై హ్యారీ బ్రూక్ 202పరుగులు సాధించడం కూడా అతడి సామర్థ్యాన్ని చాటింది.

ADVERTISEMENT

వివరాలు

డబుల్ సెంచరీలంటే మొదట గుర్తొచ్చేది రోహిత్ శర్మే!

వన్డే క్రికెట్‌లో భవిష్యత్తులో మరిన్ని డబుల్ సెంచరీలు నమోదయ్యే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లు కొత్త రికార్డులు సృష్టించవచ్చు.

కానీ మూడు డబుల్ సెంచరీలు, 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఎంతమంది కొత్త రికార్డులు సృష్టించినా.. వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీల గురించి చర్చ వచ్చినప్పుడు మొదట గుర్తుకొచ్చే పేరు రోహిత్ శర్మదే.

అతడి 264 పరుగుల రికార్డును భవిష్యత్తులో ఎవరైనా అధిగమిస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

ADVERTISEMENT