Sawan Barwal: ఆసియా క్రీడల్లో సావన్ చరిత్ర.. 44 ఏళ్ల తర్వాత మారథాన్‌లో భారత్‌కు రజతం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్, ఆర్మీ హవల్దార్ సావన్ బర్వాల్ (Sawan Barwal) చరిత్ర సృష్టించాడు. 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మారథాన్‌లో భారత్‌కు పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన పురుషుల మారథాన్‌లో సావన్ 2:11:37 గంటల్లో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఆసియా క్రీడల మారథాన్‌లో భారత పతకం కోసం కొనసాగుతున్న సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల సావన్ బర్వాల్ భారత ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మారథాన్ ప్రారంభం నుంచే అతడు ఆధిపత్యం ప్రదర్శించాడు.
వివరాలు
రెండో స్థానానికి పరిమితం
35 కిలోమీటర్ల మార్క్ వరకు సావన్ ముందంజలోనే కొనసాగాడు. అయితే చివరి 7 కిలోమీటర్లలో వేగం కాస్త తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
సొంత గడ్డపై జరిగిన ఈ పోటీలో జపాన్‌కు చెందిన ఇచితాకా యమషితా 2:10:49 గంటల్లో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
సావన్ కంటే అతడు కేవలం 48 సెకన్ల ముందుగా గమ్యాన్ని చేరాడు. దీంతో సావన్‌కు పసిడి పతకం తృటిలో చేజారింది. చైనాకు చెందిన పేయూ కాంస్య పతకాన్ని సాధించాడు.
వివరాలు
మారథాన్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం
ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్ పతకం సాధించడం ఇది నాలుగోసారి. 1951లో దిల్లీలో జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ ఈ విభాగంలో స్వర్ణం, కాంస్య పతకాలను సాధించింది.
అనంతరం 1982లో భారత్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో సీతారాం కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 44 ఏళ్లకు సావన్ బర్వాల్ విదేశీ గడ్డపై రజత పతకంతో మెరిశాడు. దీంతో ఆసియా క్రీడల మారథాన్‌లో భారత పతకాల జాబితాలో మరో పతకం చేరింది.
వివరాలు
కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన
తాజా పోటీలో సావన్ 2:11:37 గంటల్లో రేసును పూర్తి చేయడం అతడి కెరీర్‌లోనే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన మారథాన్ పోటీల్లో సావన్ 2:11:58 గంటల్లో రేసును పూర్తి చేశాడు.
అంతకుముందు భారత మారథాన్ రన్నర్ శివనాథ్ సింగ్ పేరిట ఉన్న 2:12:00 గంటల రికార్డును సావన్ తిరగరాశాడు.
ఇప్పుడు ఆసియా క్రీడల్లో 2:11:37 గంటలతో తన వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంతోపాటు.. గత రికార్డును కూడా మరింత మెరుగుపరిచాడు.