Neeru Dhanda: చరిత్ర సృష్టించిన షూటర్ నీరూ ధండా.. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడల్లో 10వరోజు భారత్ గన్ గట్టిగా పేలింది. 2026 సీజన్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం లోటు తీర్చి చరిత్ర సృష్టించారు షూటర్ నీరూదండా. మహిళల ట్రాప్ షూటింగ్‌లో నీరూ (Neeru Dhanda) తొలిస్థానంలో నిలిచి.. పసిడిని చేజిక్కించుకున్నారు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు ఐదో బంగారు పతకం సొంతమైంది (Women TRAP SHOOTING). ఇప్పటికే మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ రజత పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ బృందంలో ఆమెతో పాటు ఆషిమా అహ్లావత్, మనీషా కీర్ ఉన్నారు.
వివరాలు
11వ స్థానంలో భారత్
ఈ ఆసియా క్రీడల్లో (Asian Games) మహిళల క్రికెట్ ఫైనల్‌లో హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయంతో తొలి స్వర్ణాన్ని దక్కించుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్ జంట పసిడి సొంతం చేసుకుంది.
ఇక కబడ్డీలో మహిళల, పురుషుల టీమ్‌లు పసిడి కూతపెట్టాయి. అయితే ఇవన్నీ టీమ్ ఈవెంట్స్. నీరూ స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ ఒక స్థానం ముందుకు వెళ్లింది.
5 బంగారు, 21 రజత, 21 కాంస్య పతకాలతో 11 స్థానంలో నిలిచింది.
ఖాళీ టిన్నులకు గురిపెట్టి.. ఇప్పుడు స్వర్ణం పట్టిన ఆర్మీ ఆఫీసర్ షూటింగ్ సంచలనం నీరూదండా.. హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందినవారు. ఆమె కుటుంబానిది గ్రామీణ నేపథ్యం.
వివరాలు
మధ్యప్రదేశ్ షూటింగ్ అకాడమీలో చేరిక
తన కజిన్ లక్షయ్ షెరాన్ (Lakshay Sheoran) 2018 ఆసియా గేమ్స్‌లో ట్రాప్ షూటింగ్‌లో రజత పతకం గెలిచాడు. అతడి ఆటను చిన్నతనం నుంచి చూస్తూ పెరిగారు నీరూ.
ఆ ఆసక్తే ట్రాప్ షూటింగ్‌ను సీరియస్‌గా తీసుకునేలా చేసింది. లక్షయ్ సహకారం కూడా తోడైంది. అతడు ఇచ్చిన తుపాకీతో సాధన ప్రారంభించారు.
అంతేగాకుండా తన కుటుంబానికి చెందిన డబుల్ బ్యారెల్ తుపాకీతో ఖాళీ టిన్ (tin cans)లకు గురిపెట్టి ప్రాక్టీస్ చేసేవారు.
మెరుగైన శిక్షణ కోసం హరియాణా నుంచి మధ్యప్రదేశ్ వచ్చి షూటింగ్ అకాడమీలో చేరారు.
ఆ శిక్షణే ఆమె అంతర్జాతీయ వేదికలపై మెరిసే దిశగా తీర్చిదిద్దింది. 2022లో క్రొయేషియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేశారు.
వివరాలు
వ్యక్తిగత విభాగంలో స్వర్ణం
2025లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో తొలి బంగారు పతకాన్ని గెల్చుకున్న ఆమె.. 2026 ఇటలీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని ఎగరేసుకుపోయారు.
ఈ అంతర్జాతీయ టోర్నీలో ట్రాప్ షూటింగ్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ 2026 ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో తొలి బంగారు పతకాన్ని అందించి.. చరిత్ర సృష్టించారు.
ఒకవైపు ఆటలో రాణిస్తూనే దేశ సేవ చేస్తున్నారు. భారత సైన్యంలో నాయబ్ సుబేదార్ (Naib Subedar) హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో మవూలోని ఆర్మీ మార్క్‌మ్యాన్‌షిప్ యూనిట్‌లో శిక్షణ పొందుతోన్న నీరూ క్రీడా ప్రయాణంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.