LOADING...
IND Vs NZ: రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు
రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు

IND Vs NZ: రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా దృష్టిపెట్టిన టీమిండియా.. బుధవారం జరగనున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భారత జట్టుకు గాయాల బెడద తప్పలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడటంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సెలక్టర్లు యువ ఆటగాడు ఆయుష్‌ బదోనిని జట్టులోకి తీసుకున్నారు. ఇక తొలి మ్యాచ్‌కు ముందే వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ కూడా గాయంతో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు నెల రోజులకంటే తక్కువ సమయం మాత్రమే ఉండటంతో ఇకపై మరిన్ని గాయాలు కావొద్దని టీమ్‌ఇండియా కోరుకుంటోంది.

వివరాలు 

రెట్టించిన ఉత్సాహంతో భారత్

ఆటగాళ్ల గాయాలు ప్రతికూలమైనప్పటికీ రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేకు టీమ్‌ఇండియా జోష్‌తో సిద్ధమవుతోంది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి అద్భుత ఫామ్‌ జట్టుకు పెద్ద బలం.తొలి వన్డేలో కోహ్లి 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ధైర్యంగా బ్యాటింగ్‌ చేస్తూ పాత రోజులను గుర్తు చేస్తున్నాడు.మరోసారి అతడి బ్యాట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ వస్తుందనే ఆశ జట్టులో ఉంది. కోహ్లితో పాటు కెరీర్‌ చివరి దశలో ఉన్న రోహిత్‌ శర్మ కూడా ఆటను ఆస్వాదిస్తున్నాడు. వడోదరలో ఎక్కువసేపు క్రీజ్‌పై నిలవకపోయినా మంచి లయలో కనిపించాడు.

వివరాలు 

రెట్టించిన ఉత్సాహంతో భారత్

కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా తొలి మ్యాచ్‌లో రాణించారు. ఈ బ్యాటర్ల ఫామ్‌తో భారత బ్యాటింగ్‌ లైన్‌అప్‌ బలంగా కనిపిస్తోంది. అయితే గాయపడ్డ సుందర్‌ స్థానంలో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్‌రౌండర్‌ స్థానానికి బదోని, నితీశ్‌ల మధ్య పోటీ నెలకొంది. నితీశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌ విభాగంలో మాత్రం భారత్‌ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పేసర్లు హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణ పరుగుల నియంత్రణపై దృష్టి పెట్టాలి. తొలి వన్డేలో వీరు ఆరు కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చారు. అలాగే స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా మరింత ప్రభావవంతంగా బంతులు వేయాల్సి ఉంది.

Advertisement

వివరాలు 

న్యూజిలాండ్‌ పుంజుకునేనా..!

తొలి వన్డేలో ఓడిపోయినా చివరి వరకు పోరాడటం న్యూజిలాండ్‌కు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అంశం. మిచెల్‌, కాన్వే, నికోల్స్‌ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే విషయం. తొలి మ్యాచ్‌లో ఈ ముగ్గురు అర్ధశతకాలతో మెరిశారు. యంగ్‌, ఫిలిప్స్‌, కెప్టెన్‌ బ్రాస్‌వెల్‌ కూడా పరుగుల బాట పట్టాలని కివీస్‌ ఆశిస్తోంది. బౌలింగ్‌లో జేమీసన్‌ అద్భుతంగా రాణించాడు. రెండో వన్డేలోనూ అతడిపైనే న్యూజిలాండ్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. అయితే తొలి మ్యాచ్‌లో తేలిపోయిన మిగతా బౌలర్లు ఎంతవరకు సహకరిస్తారన్నదానిపైనే ఈ మ్యాచ్‌లో కివీస్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Advertisement

వివరాలు 

పిచ్‌ పరిస్థితి

రాజ్‌కోట్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవడం పరిపాటి. రెండో వన్డేలో తొలి మ్యాచ్‌కంటే ఎక్కువ పరుగులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ వేదికపై ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లోనూ ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. అందులో మూడు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. చివరిసారి ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 352 పరుగులు చేసి భారత్‌ను 66 పరుగుల తేడాతో ఓడించింది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది.

వివరాలు 

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్, రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి/ఆయుష్‌ బదోని, జడేజా, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, సిరాజ్‌ న్యూజిలాండ్‌: కాన్వే, నికోల్స్, విల్‌ యంగ్, డరెల్‌ మిచెల్, మిచెల్‌ హే, గ్లెన్‌ ఫిలిప్స్, బ్రాస్‌వెల్, క్రిస్టియన్‌ క్లార్క్, జేమీసన్, ఫౌక్స్, జేడెన్‌ లెనాక్స్‌.

Advertisement