Ind Vs SA: శుభ్‌మన్ గిల్ డిశ్చార్జ్.. వారం విశ్రాంతి తప్పనిసరి.. రెండో టెస్ట్‌కి దూరమా?
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన సంఘటన తెలిసిందే. మెడ నొప్పితో ఆసుపత్రిలో చేరిన గిల్ తాజాగా డిశ్చార్జ్ అయ్యి, ప్రస్తుతం టీమ్ హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెడ గాయం దృష్ట్యా గిల్‌కు విమాన ప్రయాణాలు చేయొద్దని వైద్యులు సూచించినట్లు సమాచారం. కనీసం వారం రోజులపాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని వారు చెప్పారు. టీమ్ హోటల్‌లో ఉన్న గిల్ ఆరోగ్యాన్ని బీసీసీఐ వైద్య బృందం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.
Details
రెండో టెస్ట్‌కి గిల్ అందుబాటులో ఉంటాడా?
ప్రస్తుతం గిల్ కోలుకునే దశలో ఉన్నప్పటికీ, నవంబర్ 22 నుంచి గువాహటిలో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కి అతడు ఆడే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. అతడు ఇప్పుడు మెడను కొంతవరకు కదిలించగలుగుతున్నా, వైద్యులు సంపూర్ణ విశ్రాంతినే సూచించారు. తొలి టెస్టులోనే గిల్ గైర్హాజరు కావడం టీమిండియాకు పెద్ద లోటు కాగా, రెండో టెస్టుకూ అతను అందుబాటులో లేకపోవడం జట్టుకు మరో దెబ్బ అని చెప్పాలి.
Details
గాయం ఎలా జరిగింది?
సౌతాఫ్రికాతో రెండో రోజు ఆటలో గిల్ సైమన్ హర్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించగా అకస్మాత్తుగా అతని మెడ పట్టేసింది. ఫిజియో వెంటనే వచ్చి చికిత్స చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. మూడు బంతులు ఆడిన తర్వాత గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పావిలియన్ చేరాడు. అనంతరం గాయ తీవ్రతరం కావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. గిల్ ఐసీయూలో ఉన్నారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.