Loading...
FIFA World Cup: అపశకునం భయంతో ఫైనల్‌కు దూరం.. అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం!
అపశకునం భయంతో ఫైనల్‌కు దూరం.. అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం!

FIFA World Cup: అపశకునం భయంతో ఫైనల్‌కు దూరం.. అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్‌లో ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఇలాంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో తమ దేశ జట్టు ఆడుతుంటే ఆ దేశాధ్యక్షుడు స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణమే. అయితే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్‌ను స్టేడియంలో కాకుండా తన ఇంట్లోనే టీవీలో వీక్షించనున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రధాన కారణంగా అర్జెంటీనాలో చాలా కాలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్‌ చెబుతున్నారు. గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించగా, ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోయింది. అప్పటి నుంచి ఆ అధ్యక్షుడిపై 'ముఫా' (అపశకునం) అనే ముద్ర పడింది.

వివరాలు

ఏడు మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా లేదు

అదే సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని జావియర్ మిలే ఫైనల్‌కు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అయితే ఈ నిర్ణయం వెనుక మరో ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. లియోనెల్ మెస్సీకి వీరాభిమాని అయిన జావియర్ మిలే, ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లను తన ఇంట్లో నుంచే వీక్షించారు.

ఆ ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఒక్క ఓటమి గానీ, డ్రా గానీ లేకుండా వరుస విజయాలతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా మరోసారి ఫైనల్‌కు చేరుకుంది.

దీంతో అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ ఏడు మ్యాచ్‌లను జావియర్ మిలే ఒకే హెవీ జాకెట్‌ ధరించి వీక్షించారట.

వివరాలు

సెంటిమెంట్లు కొత్తేమీ కాదు

అందుకే ఫైనల్ మ్యాచ్‌ను కూడా అదే జాకెట్‌ వేసుకుని ఇంట్లోనే చూడనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం వెల్లడించింది.

ఫిఫా ప్రపంచకప్‌లో ఇలాంటి మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు కొత్తవి కావు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ సందర్భంగా కూడా అర్జెంటీనా అభిమానులు "కాబాలాస్" పేరుతో పలు సెంటిమెంట్లను అనుసరించారు.

కొందరు ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలను ఫ్రీజర్‌లో ఉంచడం, మరికొందరు తమకు నమ్మకమైన దేవతలను ప్రార్థించడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ADVERTISEMENT

వివరాలు

ఇంట్లో నుంచే చూస్తా

ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశాధ్యక్షుడే సెంటిమెంట్ కారణంగా ఫైనల్‌ను స్టేడియంలో కాకుండా ఇంట్లోనే వీక్షిస్తానని ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడైన జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం కూడా అందింది.

ట్రంప్‌, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో కలిసి న్యూజెర్సీలో జరిగే ఫైనల్‌ను వీక్షిస్తారా అని ప్రశ్నించగా.. "లేదు... నేను ఎక్కడికీ వెళ్లను. ఒలివోస్‌లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్‌ను చూస్తానని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

'అపశకునం' సెంటిమెంట్ ఎలా మొదలైంది?

అర్జెంటీనా అధ్యక్షులు కీలక ప్రపంచకప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండే సంప్రదాయం 1990 ప్రపంచకప్ నుంచి కొనసాగుతోంది. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్ కామెరూన్‌తో జరిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.

అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా ఆ మ్యాచ్‌లో అనూహ్యంగా కామెరూన్ చేతిలో ఓడిపోయింది.

ఆ పరాజయం తర్వాత అధ్యక్షుడు కార్లోస్ మెనెమ్‌పై "ముఫా" (అపశకునం) అనే ముద్ర పడింది.

అప్పటి నుంచి ప్రపంచకప్ ఎక్కడ జరిగినా అర్జెంటీనా అధ్యక్షులు జాతీయ జట్టు మ్యాచ్‌లకు ప్రత్యక్షంగా హాజరుకాకుండా ఉండడం ఆనవాయితీగా మారింది.

ఇప్పుడు జావియర్ మిలే కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌ను ఇంట్లోనే వీక్షించేందుకు సిద్ధమయ్యారు.

ADVERTISEMENT