Smriti Mandhana: కోలుకున్న స్మృతి తండ్రి.. వాయిదా పడిన పెళ్లి కొత్త తేదీపై ఇంకా స్పష్టత ఇవ్వని కుటుంబసభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆమె తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగై డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని, పూర్తిగా కోలుకుంటున్నారని డాక్టర్లు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం జరగాల్సిన స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి ఉదయం, శ్రీనివాస్‌కు ఆకస్మిక హార్ట్ అటాక్ రావడంతో వేడుకను నిరవధికంగా వాయిదా వేసారు. ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోగ్రఫీ పరీక్షలు నిర్వహించగా రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవని వైద్యులు నిర్ధారించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆసుపత్రి ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు.
వివరాలు
ఒత్తిడి కారణంగా ముంబై ఆసుపత్రిలో చేరిన వరుడు పలాశ్ ముచ్చల్
అయితే,ఈ సందర్భంలోనే మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది.స్మృతి మంధాన కాబోయే భర్త, ప్రఖ్యాత గాయకుడు పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. వరుస ప్రోగ్రాంలు,పెళ్లి ఏర్పాట్ల కారణంగా ఆయన తీవ్రమైన శారీరక ఒత్తిడికి లోనై ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. ఎన్డీటీవీ వర్గాల ప్రకారం పలాశ్‌ను ముంబై గోరేగావ్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్చి, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. ఒకవైపు తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం కుటుంబానికి ధైర్యాన్నిచ్చినా, మరోవైపు వరుడు ఆసుపత్రిపాలు కావడంతో వివాహ తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇదే సమయంలో స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పెళ్లికి సంబంధించిన ఫోటోలను తొలగించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది.పెళ్లి కోసం కొత్త తేదీని రెండు కుటుంబాలు ఇంకా ప్రకటించలేదు.