IND Vs SL: భారత్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైన శ్రీలంక ఎలెవన్.. 15 మంది సభ్యులతో జట్టు వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి కొలంబో క్రికెట్ క్లబ్ మైదానం వేదికగా భారత్ జట్టు, శ్రీలంక ఎలెవన్‌తో తలపడుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ వార్మప్ మ్యాచ్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక ఎలెవన్ జట్టును ప్రకటించింది. యువ బౌలింగ్ ఆల్‌రౌండర్ సోనల్ దినూషకు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. రాబోయే టెస్టు సిరీస్‌లో శ్రీలంక ప్రధాన జట్టులో చోటు కోసం పోటీపడుతున్న ఏడుగురు కీలక ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం లభించింది.
వివరాలు
జట్టు ఇదే..
కెప్టెన్ సోనల్ దినూషతో పాటు వేగవంతమైన బౌలర్లు లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, ఆఫ్‌స్పిన్నర్ రమేశ్ మెండిస్, నిషాన్ మదుష్క, పవన్ రత్నాయకే, అంజల బండార ఈ జాబితాలో ఉన్నారు.
ఇటీవల ఇండియా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఎడమచేతి స్పిన్నర్ దిలుమ్ సుదీరకు కూడా ఈ జట్టులో స్థానం దక్కింది.
అలాగే అదే మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన కేసర నువాంతకు కూడా అవకాశం కల్పించారు.
వివరాలు
టీమిండియాకు మంచి అవకాశం..
ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు శ్రీలంక ఇప్పటివరకు అధికారిక జట్టును ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే వార్మప్ మ్యాచ్ ద్వారా ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించడంతో పాటు, స్పిన్‌కు అనుకూలంగా ఉండే శ్రీలంక పిచ్‌ల పరిస్థితులను అర్థం చేసుకునేందుకు టీమిండియాకు ఇది మంచి అవకాశంగా మారనుంది.