క్రికెట్ లీగ్స్‌పై సౌరబ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు
క్రికెట్ లీగ్స్ ఆడటానికి క్రికెటర్లు ఇష్టపడుతుంటారు. ఇండియన్ ఐపీఎల్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్స్ వేలంలో ప్రస్తుతం పోటీ కనిపిస్తోంది. ఏదో ఒక లీగ్‌లో ఆడాలని ప్రస్తుత క్రికెటర్లు ఆరాటపడుతున్నారు. అందుకే ఈ లీగ్స్‌కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ లీగ్స్‌పై ప్రస్తుతం బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్లలో కొన్ని క్రికెటింగ్ లీగ్స్ మాత్రమే ఉంటాయని, లీగ్స్ ముఖ్యం కాదనే విషయాన్ని ఆటగాళ్లు గ్రహిస్తారని చెప్పారు. అయితే క్రికెటింగ్ లీగ్స్ లో ఐపీఎల్ ప్రత్యేకమైందని, భిన్నమైన వాతావరణంలో ఈ టోర్నిని నిర్వహిస్తారని గంగూలీ చెప్పారు.
ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే లీగ్స్ కొనసాగుతాయి
రాబోయే కాలంలో సరైన పర్యావరణ వ్యవస్థలతో కూడిన లీగ్‌లు మాత్రమే మనుగడ సాగిస్తాయని, మిగిలినవి చివరికి కనుమరుగు అవుతాయని కోల్‌కతాలోని స్టార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌లో సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా అతిథ్యం ఇస్తున్న బిగ్ బాష్ లీగ్ కూడా అద్భుతంగా ఉందని, ఈ మధ్యే మొదలైన దక్షిణాఫ్రికా లీగ్ కూడా ఆసక్తి ఉందని, గత మూడు వారాలుగా ఈ టోర్నిని గమనిస్తున్నానని గంగూలీ పేర్కొన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకొనే లీగ్స్ మాత్రమే కొనసాగుతాయని, క్రికెట్‌ను ప్రోత్సహించే వ్యవస్థ కూడా చాలా ముఖ్యమని, ప్రస్తుతం క్రికెట్‌కు ఆదరణ ఉన్న దేశాల్లోనే మాత్రమే లీగ్స్ ఉన్నాయని, క్రికెట్ బోర్డులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఆటగాళ్లతో మంచి సంబంధాలను కొనసాగించాలని గంగూలీ తెలియజేశారు.