Australia: ఆసీస్ మహిళా క్రికెట్‌లో కలకలం.. వైస్ కెప్టెన్ గార్డనర్‌పై మాజీ భార్య సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ తీవ్ర ఆరోపణలు చేశారు. సహచర క్రికెటర్ జార్జియా వోల్‌తో గార్డనర్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపిస్తూ.. గార్డనర్‌ను వెంటనే వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కోడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన మోనికా రైట్.. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కిన క్రికెటర్లు, ముఖ్యంగా నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎందుకు బహిరంగంగా స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.
వివరాలు
వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలి
"దేశానికి ప్రాతినిధ్యం వహించే గౌరవం లభించినప్పుడు, రోల్ మోడల్‌గా వ్యవహరించే బాధ్యత కూడా ఉంటుంది.
ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు బహిరంగంగా స్పందించడం లేదో నాకు అర్థం కావడం లేదు.
వారి మౌనం ఆష్లే, జార్జియా చర్యలను సమర్థించినట్లేనా? జూనియర్ సభ్యురాలితో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి నాయకత్వ పదవిలో ఎలా కొనసాగుతారు? కెప్టెన్లు, నాయకులు ఇతరులకు ప్రమాణాలు నిర్దేశించాలి. కానీ ఇలాంటి ప్రవర్తన అందుకు పూర్తిగా విరుద్ధం" అని రైట్ విమర్శించారు.
అయితే ఈ ఆరోపణలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. గార్డనర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారంగా పేర్కొంటూనే, జట్టు సభ్యుల మధ్య సంబంధాలు సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూస్తామని స్పష్టం చేసింది.
వివరాలు
2025లో స్వలింగ వివాహం
"మా సిబ్బంది మధ్య ఉన్న అన్ని సంబంధాలు మా 'రెస్పెక్ట్ ఎట్ వర్క్' పాలసీకి అనుగుణంగా ఉండేలా చూస్తాం. నాయకత్వ బాధ్యతలకు మద్దతు ఇవ్వడంతో పాటు, జట్టు ప్రక్రియల సమగ్రతను కాపాడేందుకు అవసరమైన కాన్ఫ్లిక్ట్-ఆఫ్-ఇంటరెస్ట్ ఏర్పాట్లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా, 'డైలీ మెయిల్' కథనం ప్రకారం.. ఆష్లే గార్డనర్, మోనికా రైట్‌లకు 2025 ఏప్రిల్‌లో స్వలింగ వివాహం జరిగింది.
అయితే 2025లో భారత్‌లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలో గార్డనర్, జార్జియా వోల్‌తో సంబంధం పెట్టుకున్నారని మోనికా రైట్ ఆరోపించడంతో వారి బంధంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. అనంతరం గార్డనర్, రైట్ విడిపోయారు.
వివరాలు
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో చర్చనీయాంశం
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో గార్డనర్‌కు ఆమె ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) ఫ్రాంచైజీ సిడ్నీ సిక్సర్స్ అండగా నిలిచింది.
సిడ్నీ సిక్సర్స్ జనరల్ మేనేజర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రాచెల్ హేన్స్.. గార్డనర్ వ్యక్తిగత జీవితంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.
"ఆమె వ్యక్తిగత జీవితంపై నేను వ్యాఖ్యానించను. నేను ఆష్లేతో టచ్‌లో ఉన్నాను. మేము ఆమెకు మద్దతుగా ఉన్నామని ఆమెకు తెలుసు. మా క్లబ్‌లో ఆమె ఒక ముఖ్యమైన, గౌరవనీయమైన క్రీడాకారిణి" అని రాచెల్ హేన్స్ తెలిపారు.
దీంతో ఆష్లే గార్డనర్‌పై మాజీ భార్య చేసిన ఆరోపణలు, క్రికెట్ ఆస్ట్రేలియా స్పందన, సిడ్నీ సిక్సర్స్ మద్దతు ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.