Ashish yadav: కర్ర జావెలిన్‌తో మొదలుపెట్టి.. ప్రపంచ వేదికపై పతకం గెలిచిన కుర్రాడు!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా మవైయా గ్రామానికి చెందిన ఆశిష్ యాదవ్‌కు చిన్నప్పటి నుంచే ఆటలంటే ఎంతో ఇష్టం. అతడి తండ్రి పాల వ్యాపారం చేస్తుంటారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రాణించడం చూసి ఆశిష్ కూడా ఆ క్రీడవైపు ఆకర్షితుడయ్యాడు. తన ఆరాధ్య ఆటగాడిలా జావెలిన్‌లో రాణించాలనుకున్నాడు. అయితే సరైన సదుపాయాలు లేకపోవడంతో తొలుత కర్రతోనే జావెలిన్ తయారు చేసుకున్నాడు. కర్రను విసిరితే ఎవరికీ తగలకూడదనే ఉద్దేశంతో గ్రామంలోని ఎండిపోయిన చెరువును తన ప్రాక్టీస్ గ్రౌండ్‌గా మార్చుకున్నాడు. అక్కడే గంటల తరబడి సాధన చేసేవాడు. తన ఆరాధ్య ఆటగాడు నీరజ్ చోప్రా బాటలో నడుస్తూ ప్రపంచ అండర్-20 టోర్నీలో పతకం గెలిచి ఆశిష్ సత్తా చాటాడు.
వివరాలు
2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకం..
ఆశిష్ కుటుంబంలోనూ క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంది. అతడి అత్త పూనమ్ యాదవ్ వెయిట్‌లిఫ్టర్. ఆమె 2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకం కూడా సాధించారు.
మామయ్య ధరంతేజ్ సింగ్ డిస్కస్ త్రో క్రీడాకారుడు. అయితే వారిలా కాకుండా ఆశిష్ మాత్రం నీరజ్ చోప్రాను స్ఫూర్తిగా తీసుకుని జావెలిన్ త్రోను ఎంచుకున్నాడు.
మామయ్య కొనిచ్చిన కర్ర జావెలిన్‌లతోనే అతడు తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు.
గ్రామంలో సరైన మైదానం లేకపోవడంతో ఎండిపోయిన చెరువునే సాధనకు ఎంచుకున్నాడు.
అక్కడైతే కర్రను ఎంత దూరం విసిరినా ఎవరికీ తగిలే ప్రమాదం ఉండదని భావించాడు.
జావెలిన్‌ను ఎలా పట్టుకోవాలి? ఎలా విసరాలి? అనే విషయాలను నీరజ్ చోప్రా వీడియోలు చూస్తూ నేర్చుకున్నాడు.
వివరాలు
మరింత కష్టపడి సాధన..
జాతీయ స్థాయి టోర్నీల్లో క్రమంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఆశిష్.. ఈ ఏడాది పటియాలాలో జరిగిన ఇండియా ఓపెన్ త్రోస్ పోటీల్లో 74.49 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతకం సాధించాడు.
అనంతరం లుథియానాలో జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్‌లో 72.27 మీటర్ల త్రోతో కాంస్య పతకం గెలిచాడు.
తుమకూరులో జరిగిన జాతీయ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్‌లో రజతం సాధించాడు.
హాంకాంగ్‌లో జరిగిన ఆసియా అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకోవడం ఆశిష్‌ను నిరాశకు గురిచేసింది.
అయినప్పటికీ అతడు పట్టువదలలేదు. మరింత కష్టపడి సాధన చేసి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించాడు.
వివరాలు
ప్రపంచ టోర్నీలో దేశానికి పతకం..
జావెలిన్ విసిరిన తర్వాత నీరజ్ చోప్రా మాదిరిగా ఆశిష్ నేలపై చేతులు పెట్టాడు.
ఆరు అడుగులకు పైగా ఎత్తున్న ఈ యూపీ కుర్రాడు.. జావెలిన్‌ను చెవులకు సమీపంగా ఉంచుకుని వీలైనంత నేరుగా విసురుతాడు.
ఎంత వేగంగా ఈటెను విసిరినా.. దృఢమైన శరీరాకృతి కారణంగా ముందుకు పడిపోకుండా తనను తాను నియంత్రించుకుంటాడు.
''కోచింగ్‌కు వచ్చినప్పుడు ఆశిష్ జావెలిన్‌ను కేవలం 60 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగేవాడు.
తక్కువ బరువు ఉన్నప్పటికీ అతడిలో మంచి వేగం ఉంది. ఎత్తు కూడా ఎక్కువగా ఉండటంతో జావెలిన్ త్రోకు అతడు సరిపోతాడని భావించాను.
గత రెండేళ్లలో అతడి త్రో ఎంతో మెరుగుపడింది. ఇప్పుడు ప్రపంచ టోర్నీలో దేశానికి పతకం అందించగలిగాడు'' అని కోచ్ అరవింద్ కుమార్ తెలిపారు.