LOADING...
Suryakumar Yadav: ఇంగ్లండ్ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించిన సూర్యకుమార్
ఇంగ్లండ్ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించిన సూర్యకుమార్

Suryakumar Yadav: ఇంగ్లండ్ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించిన సూర్యకుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 5న జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్‌ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండో ఎడిషన్‌లో, మొత్తం నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయినా భారత శిబిరంలో మాత్రం గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్‌ జాకబ్ బెతల్ భారత బౌలర్లను తీవ్రంగా పరీక్షించాడు. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డ అతడు కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు.

Details

రాణించిన బేతెల్

అయితే బేతెల్‌ సెంచరీ పూర్తి చేసిన కొద్ది సేపటికే భారత్‌కు కీలక బ్రేక్‌ లభించింది. 18 బంతుల్లో 45 పరుగులు అవసరమైన సమయంలో 18వ ఓవర్‌ వేసిన జస్పిత్ బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని కష్టతరం చేశాడు. 19వ ఓవర్‌లో బంతి అందుకున్న హర్దిక్ పాండ్యా ప్రమాదకరంగా మారుతున్న సామ్ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో కేవలం 9 పరుగులే ఇచ్చాడు. దీంతో భారత్‌కు గెలుపుపై విశ్వాసం పెరిగింది. చివరి ఓవర్‌ను శివం దూబే వేసాడు. తొలి బంతికే బేతెల్‌ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది.

Details

సంజు శాంసన్ ఆట అద్భుతం

తర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు జోఫ్రా ఆర్చర్ సిక్సర్లు కొట్టినా అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైంది. ఇదిలా ఉంటే, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్‌ సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులతో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లను కూడా ప్రశంసించాడు.

Advertisement

Details

స్వదేశంలో వరల్డ్‌కప్‌ గురించి కీలక వ్యాఖ్యలు 

"స్వదేశంలో ప్రపంచకప్‌ జరుగుతుండగా ఇలాంటి అద్భుతమైన జట్టును నడిపించడం, ఈ జట్టుతో ఫైనల్‌కు చేరడం చాలా ప్రత్యేకమైన అనుభూతి" అని పేర్కొన్నాడు. సంజూ క్రీజులోకి వచ్చిన వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలమని గుర్తించి ధైర్యంగా ఆడాడు. గత ఏడాది నుంచి అతడు చేసిన కష్టానికి ఇది ఫలితం. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడాడు" అని ప్రశంసించాడు. ఇంగ్లండ్‌ లక్ష్య ఛేదనపై "వారి ఛేజ్‌ అద్భుతం. హ్యారీ బ్రూక్‌ని చూసి ఇంకెంత స్కోర్‌ చేయాలనుకుంటున్నావని అడిగాను. వారు చివరి వరకు మ్యాచ్‌లోనే ఉన్నారు. కానీ బుమ్రా, ఆర్షదీప్ సింగ్, హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. బుమ్రా మరోసారి తన క్లాస్‌ చూపించాడని చెప్పాడు.

Advertisement

Details

అద్భుతమైన క్యాచులు పట్టారు

"ఫీల్డింగ్‌ కోచ్‌ T. Dilip కృషిని గుర్తించాలి. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు మైదానంలో పదారసంలా కదిలారు. అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు పరుగులను నియంత్రించారు. ప్రాక్టీస్‌ సెషన్లలో చేసిన కృషి ఫలించిందని వివరించాడు. బ్యాటింగ్ కాంబినేషన్‌పై "మూడో స్థానం వరకు బ్యాటింగ్‌ స్థిరంగా ఉంది. అదిల్ రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు శివమ్‌ దూబేను పంపడం సరైన నిర్ణయం. జట్టు అవసరమైతే నా స్థానాన్ని మార్చుకోవడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పాడు. ఇక భారత్‌ మార్చి 8న ఫైనల్‌లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.

Advertisement