LOADING...
SA VS WI: షెఫర్డ్-హోల్డర్ పోరాటం వృథా.. విండీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా
షెఫర్డ్-హోల్డర్ పోరాటం వృథా.. విండీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా

SA VS WI: షెఫర్డ్-హోల్డర్ పోరాటం వృథా.. విండీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
06:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా జట్టు మరో భారీ విజయాన్నినమోదు చేసింది. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (82*) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై సఫారీలు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలోనే గెలుపు గమ్యాన్ని చేరుకుంది. మార్‌క్రమ్‌ అర్ధ శతకం నమోదు చేయగా, ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌ 47 పరుగులు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రైన్‌ రికెల్టన్‌ 45* పరుగులతో రాణించారు.

వివరాలు 

దక్షిణాఫ్రికా ఖాతాలో 4 పాయింట్లు

విండీస్‌ తరఫున రోస్టన్‌ ఛేజ్‌ ఒక వికెట్‌ సాధించాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ అవకాశాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జింబాబ్వేతో, విండీస్‌ భారత్‌తో మార్చి 1న తలపడనున్నాయి. ఇక విండీస్‌ ఇన్నింగ్స్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ప్రారంభం నుంచే కుదేలైంది. 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే రొమారియో షెఫర్డ్‌ (52*), జాసన్‌ హోల్డర్‌ (49) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.

వివరాలు 

ఎనిమిదో వికెట్‌కు షెఫర్డ్‌ - జాసన్‌ హోల్డర్‌ 89 పరుగులు  

ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 89 పరుగులు జోడించి విండీస్‌ స్కోరును 170 దాటించారు. ఇతర బ్యాటర్లలో బ్రాండన్‌ కింగ్‌ 21, షై హోప్‌ 16, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌ 12, మాథ్యూ ఫోర్డె 11, షిమ్రోన్‌ హెట్‌మయర్‌ 2, రోవ్‌మన్‌ పావెల్‌ 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. రోస్టన్‌ ఛేజ్‌ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, కగిసో రబాడ 2 వికెట్లు, కార్బిన్‌ బాష్‌ 2 వికెట్లు తీసి విండీస్‌ను కట్టడి చేశారు.

Advertisement