LOADING...
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన క్షణాలు.. అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లు
టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన క్షణాలు.. అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లు

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన క్షణాలు.. అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా చూసిన తర్వాత కథానాయకుడి నటన బాగుందని, కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారని, క్లైమాక్స్‌ భావోద్వేగానికి గురి చేసిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమాలో నచ్చిన క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాం. ఇదే విధంగా ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా అభిమానులను ఆకట్టుకున్న ఎన్నో ప్రత్యేక క్షణాలు కనిపించాయి. ఆకాశాన్ని తాకిన సిక్సర్లు, అద్భుతంగా పట్టిన క్యాచ్‌లు, చివరి ఓవర్లలో పెరిగిన ఉత్కంఠ, జట్టుకు విజయాన్ని అందించిన ఇన్నింగ్స్‌లు, మ్యాచ్‌ గమనాన్ని మార్చేసిన బౌలింగ్‌ స్పెల్‌లు ఇలా ఎన్నో హైలైట్స్‌ అభిమానులను అలరించాయి. ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించిన కొన్ని అత్యుత్తమ క్షణాలను ఇప్పుడు ఓసారి చూసేద్దాం.

వివరాలు 

మెరుపులా..

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అక్షర్‌ పటేల్‌కు బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం రాలేదు. అతడు రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో కూడా మూడు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ మాత్రమే తీసి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం రెండు అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్‌కు హీరోగా నిలిచాడు. ఐదో ఓవర్లో హ్యారీ బ్రూక్‌ కవర్స్‌ మీదుగా బంతిని గాల్లోకి లేపగా,అక్షర్‌ దాదాపు 24 మీటర్లు వెనక్కి పరుగెత్తి అద్భుతంగా క్యాచ్‌ను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ 160/4తో విజయ దిశగా సాగుతున్న సమయంలో అర్ష్‌దీప్‌ వేసిన ఫుల్‌టాస్‌ను జాక్స్‌ ఆఫ్‌సైడ్‌ వైపు ఆడాడు.

వివరాలు 

పోరాటం.. వీరోచితం

బౌండరీ లైన్‌ వద్దకు పరుగెత్తిన అక్షర్‌ బంతిని అందుకున్నాడు. అయితే నియంత్రణ కోల్పోయి బౌండరీ దాటే పరిస్థితి రావడంతో వెంటనే అక్కడే ఉన్న దూబేకి బంతిని విసిరాడు. దూబే క్యాచ్‌ అందుకోవడంతో కీలక వికెట్‌ పడింది.ఈ సంఘటన మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఒకమ్యాచ్‌లో మన జట్టు గెలిచినా,ప్రత్యర్థి జట్టులోని ఆటగాడి అద్భుత ప్రదర్శనను ప్రశంసించకుండా ఉండలేని సందర్భాలు ఉంటాయి. భారత్‌తో జరిగిన సెమీఫైనల్‌లో కేవలం 22ఏళ్ల జాకబ్‌ బెతెల్‌ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ అలాంటిదే. పెద్దగా అనుభవం లేకపోయినా,భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టార్‌ ఆటగాళ్లు తక్కువస్కోరుకే ఔటైనప్పటికీ అతడు పోరాటం ఆపలేదు. జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు.చివరి ఓవర్‌ తొలి బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో బెతెల్‌ రనౌటయ్యాడు.

Advertisement

వివరాలు 

సూపరో.. సూపర్

ఔటైన తర్వాత నిరాశతో నేలపై పడిన అతని క్షణాలు మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. అతడి పోరాట స్ఫూర్తికి క్రికెట్‌ అభిమానులు అభినందనలు తెలిపారు. 45 బంతుల్లో 105 పరుగులు చేసి, అందులో 8 ఫోర్లు,7 సిక్సర్లు బాదిన బెతెల్‌ శతకం ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. టీ20 క్రికెట్‌లో సూపర్‌ ఓవర్‌ అంటేనే మ్యాచ్‌కు ప్రత్యేక ఉత్కంఠ. ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు జరిగితే ఆ మ్యాచ్‌ మరింత థ్రిల్లర్‌లా మారుతుంది. దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌ కూడా అలాంటి ఉత్కంఠభరిత పోరును గుర్తు చేసింది. 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గానిస్థాన్‌ 187పరుగులకే (గుర్బాజ్‌ 84)పరిమితమవడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.

Advertisement

వివరాలు 

సూపరో.. సూపర్

తొలి సూపర్‌ ఓవర్లో ఇరుజట్లు 17 పరుగులు చేయడంతో అది కూడా టై అయ్యింది. రెండో సూపర్‌ ఓవర్‌లో అఫ్గానిస్థాన్‌ గెలవాలంటే 24 పరుగులు అవసరమయ్యాయి. అయితే మొదటి రెండు బంతుల్లో ఒక వికెట్‌ కోల్పోయి ఒక్క పరుగే చేసింది. మిగిలిన నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో గుర్బాజ్‌ వరుసగా మూడు బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. చివరి బంతికి మరో సిక్స్‌ కొడితే పొట్టి కప్పు చరిత్రలోనే గొప్ప విజయం అఫ్గాన్‌ ఖాతాలో చేరేది. కానీ ఆఖరి బంతికి గుర్బాజ్‌ ఔటవడంతో ఆ అవకాశాన్ని కోల్పోయింది.

వివరాలు 

జిం'బాంబు' పేలింది..

ఈసారి ప్రపంచకప్‌లో పెద్ద సంచలనం సృష్టించిన జట్టు జింబాబ్వే. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన ఆస్ట్రేలియా లీగ్‌ దశనే దాటలేకపోవడానికి జింబాబ్వే ఇచ్చిన షాక్‌ ప్రధాన కారణంగా మారింది. ఈమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 169పరుగులు చేసింది. అనంతరం బలమైన ఆస్ట్రేలియా జట్టును కేవలం 146పరుగులకే కట్టడి చేసింది.బ్యాటింగ్‌,బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన జింబాబ్వే శక్తివంతమైన ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టీ20ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సాధించిన ఇది రెండో విజయం. ఇంతకుముందు 2007లో కూడా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.అంతేకాదు,తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై కూడా విజయం సాధించి లీగ్‌ దశను అజేయంగా పూర్తి చేసింది. సూపర్‌-8లో నుంచి నిష్క్రమించినప్పటికీ జింబాబ్వే తన పోరాటంతో అభిమానుల మనసులు గెలుచుకుంది.

వివరాలు 

ఇంగ్లాండ్‌కే చెమట పట్టించారే!

చిన్న జట్టు అనుకున్న నేపాల్‌ ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చింది.అవును మనం మాట్లాడుకునేది ఇంగ్లాండ్, నేపాల్‌ లీగ్‌ దశ పోరు గురించే. 185పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన నేపాల్‌ ముందున్న సవాలు చాలా పెద్దదే. ఆర్చర్‌,రషీద్‌,కరన్‌ వంటి స్టార్‌ బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడం కష్టమని అనిపించినప్పటికీ నేపాల్‌ ఆటగాళ్లు ధైర్యంగా ఆడారు. మ్యాచ్‌ను గెలిచే స్థితికి కూడా చేరుకున్నారు. చివరి ఓవర్‌లో నేపాల్‌కు 10 పరుగులు అవసరమయ్యాయి. టోర్నీలోనే ఒక పెద్ద రికార్డు విజయం సాధించే అవకాశం నేపాల్‌ ఎదుట నిలిచింది. అయితే కరన్‌ ఆ ఓవర్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ నేపాల్‌ చూపిన పోరాటం క్రికెట్‌ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది.

Advertisement