T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో థ్రిల్లర్ మ్యాచ్: డబుల్ సూపర్ ఓవర్‌లో సఫారీలు గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన ఈ పోరులో ఏకంగా రెండు సూపర్ ఓవర్లు జరగడం విశేషం. చివరి వరకు ఊపిరి బిగపట్టేలా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరకు విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
వివరాలు
రెండో సూపర్ ఓవర్‌లో అఫ్గానిస్థాన్ ఓటమి
మొదటి సూపర్ ఓవర్‌లో అఫ్గానిస్థాన్ వికెట్ కోల్పోకుండా 17 పరుగులు సాధించింది. దీనికి ప్రతిగా దక్షిణాఫ్రికా ఐదు బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. చివరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్ భారీ సిక్స్ బాదడంతో మ్యాచ్ మరో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విజృంభించారు. డేవిడ్ మిల్లర్ రెండు సిక్స్‌లు, ట్రిస్టన్ స్టబ్స్ ఒక సిక్స్ కొట్టడంతో ఆ జట్టు వికెట్ నష్టంలేకుండా 23 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 19 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని చవిచూసింది. మొదటి రెండు బంతుల్లోనే పరుగులేమీ చేయకుండానే వికెట్లు పడిపోయాయి.
వివరాలు
దక్షిణాఫ్రికా బ్యాటింగ్
ఆ తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది ఆశలు రేపాడు. ఒక వైడ్ రావడంతో చివరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి గుర్బాజ్ మిల్లర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సౌతాఫ్రికా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ ర్యాన్ రికెల్‌టన్ 28 బంతుల్లో 61 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేసి అద్భుతంగా ఆడాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 41 బంతుల్లో 59 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
వివరాలు
దక్షిణాఫ్రికా బ్యాటింగ్
డెవాల్డ్ బ్రెవిస్ 23 పరుగులు (19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చేసి సహకరించాడు. డేవిడ్ మిల్లర్ 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో మార్కో యాన్సెన్ 7 బంతుల్లో 16 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి పరుగుల వేగం పెంచాడు. ఐడెన్ మార్‌క్రమ్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (1) నిరాశపరిచారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు, ఫజల్ హక్ ఫారూఖీ ఒక వికెట్ తీశారు.
వివరాలు
187 పరుగులకు ఆలౌట్ అయిన అఫ్గానిస్థాన్
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 42 బంతుల్లో 84 పరుగులు (4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేసి ఒంటరిగా పోరాడాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (22), రషీద్ ఖాన్ (20), దర్విష్ (15), ఇబ్రహీం జద్రాన్ (12) కీలక పరుగులు చేశారు. చివర్లో నూర్ అహ్మద్ 9 బంతుల్లో 15 పరుగులు (2 సిక్స్‌లు) చేసి పోరాటం చేసినా, అఫ్గానిస్థాన్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.