IND vs PAK Warm-up Matches: ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు.. వేర్వేరు మ్యాచ్ లలో భారత్,పాక్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో పెట్టుకుని అన్ని జట్లు సన్నాహాలను మరింత వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న వార్మ్-అప్ మ్యాచ్‌లు అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు మొత్తం నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో భారత్, పాకిస్థాన్ జట్లు రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో పోటీపడనున్నాయి. భారత జట్టు ఈరోజు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో తలపడనుండగా, పాకిస్థాన్ జట్టు సాయంత్రం 5 గంటలకు ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది.
వివరాలు
భారత్-పాక్ వివాదం కొనసాగుతూనే…
మైదానంలో మ్యాచ్‌ల సందడి ఉన్నప్పటికీ, మైదానం బయట పరిస్థితులు మాత్రం ఇరు జట్లకు అనుకూలంగా కనిపించడం లేదు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. మెగా టోర్నమెంట్‌లో టీమిండియాతో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఈ అంశంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఇవన్నీ పక్కనపెట్టి ఇరు జట్లు మైదానంపై దృష్టి సారించి తమ తొలి మ్యాచ్‌లకు సిద్ధమవడం ఇప్పుడు కీలకంగా మారింది. వార్మ్-అప్ మ్యాచ్‌లు జట్లకు సమన్వయం, ఆటగాళ్ల ఫామ్‌ను అంచనా వేసేందుకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
వివరాలు
మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నాయంటే..
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే వార్మ్-అప్ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. పాకిస్థాన్-ఐర్లాండ్ మ్యాచ్ మాత్రం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరుగుతుంది. అలాగే, నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటలకు, ఆఫ్ఘనిస్తాన్-వెస్టిండీస్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వేర్వేరు మైదానాల్లో జరుగనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి జట్లకు ఇవే చివరి వార్మ్-అప్ మ్యాచ్‌లు కావడం గమనార్హం. తదుపరి ఈ జట్లు నేరుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నమెంట్‌లో పోటీ పడనున్నాయి.
వివరాలు
ఆఫ్ఘనిస్తాన్ జోరు
ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పటికే తమ తొలి వార్మ్-అప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బౌలర్లు అదరగొట్టడంతో, చివరి నిమిషంలో బంగ్లాదేశ్ స్థానంలో టోర్నమెంట్‌లోకి వచ్చిన స్కాట్లాండ్‌ను కేవలం 123 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.