INDw vs BANw: టీమిండియా-బంగ్లాదేశ్ మహిళల సిరీస్ వాయిదా.. కారణమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెల జరుగాల్సిన భారత మహిళల జట్టు-బంగ్లాదేశ్ మహిళల జట్టు (INDW vs BANW) పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడినట్లు సమాచారం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనటం దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్రకారం బంగ్లాదేశ్ మహిళల జట్టు వచ్చే నెల భారత్‌ను పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కోల్‌కతా, కటక్ వేదికలుగా నిర్ణయించాలనే ఆలోచన ఉండగా.. మ్యాచ్‌ల ఖచ్చితమైన తేదీలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ సిరీస్ జరిగే సమయంలో ప్రత్యామ్నాయ సిరీస్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Details
బంగ్లాదేశ్‌లో భారీ ఆందోళనలు
"డిసెంబరులో ప్రత్యామ్నాయ సిరీస్ కోసం ఇతర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నాం. బంగ్లాదేశ్‌తో సిరీస్ విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్లడం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక రాజకీయ పరిణామాల విషయానికి వస్తే—దేశంలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి నుంచి తప్పుకుని భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి దిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. స్వదేశంలో ఆందోళనల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేశారన్న ఆరోపణలతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వాటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ 'ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్'(ICT) సోమవారం హసీనాను దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. ఈతీర్పుకు వ్యతిరేకంగా ఆమె అనుచరులు బంగ్లాదేశ్‌లో భారీ ఆందోళనలు చేపడుతున్నారు.