LOADING...
T20 World Cup India Records : వరల్డ్ కప్ విక్టరీ మాత్రమే కాదు- టీమ్ఇండియా సృష్టించిన సంచలనాలు ఇవే!
వరల్డ్ కప్ విక్టరీ మాత్రమే కాదు- టీమ్ఇండియా సృష్టించిన సంచలనాలు ఇవే!

T20 World Cup India Records : వరల్డ్ కప్ విక్టరీ మాత్రమే కాదు- టీమ్ఇండియా సృష్టించిన సంచలనాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాడ్ సెంటిమెంట్‌కు చెక్ పెట్టుతూ టీమిండియా గర్జించింది. టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ గెలుస్తుందనే మాటను పూర్తిగా తప్పు చేస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేవలం టైటిల్ సాధించడమే కాదు,క్రికెట్ చరిత్రలో అరుదుగా కనిపించే రికార్డుల వరదను కూడా సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు గణాంకాల పరంగా కూడా ప్రపంచ క్రికెట్‌లో తన స్థాయిని మరింత బలంగా నిరూపించింది. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులు నమోదవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాలు 

సిక్సర్ల వర్షం

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసిన భారత్ ఈ టోర్నీలో అనేక అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్లు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశారు. మొత్తం టోర్నీ మొత్తం మీద భారత్ 106 సిక్సర్లు బాదింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత బ్యాటర్ల దూకుడు కొనసాగింది. పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 92 పరుగులు సాధించి వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పవర్‌ప్లే స్కోరు నమోదు చేసింది. ఈ వేగవంతమైన ఆరంభం వల్లే భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

వివరాలు 

మెరుపు వేగంతో స్కోరింగ్ - కివీస్ బౌలర్లకు షాక్

భారత్ బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టడంలోనూ కొత్త రికార్డులు నెలకొల్పారు. కేవలం నాలుగు ఓవర్లలోనే జట్టు 50 పరుగుల మార్క్‌ను చేరుకుని టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఆ తరువాత కూడా అదే వేగాన్ని కొనసాగిస్తూ కేవలం 44 బంతుల్లోనే, అంటే 7.2 ఓవర్లలో జట్టు 100 పరుగులు పూర్తి చేసింది. దీంతో నాకౌట్ మ్యాచ్‌లలో వేగవంతమైన సెంచరీ స్కోరు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ టోర్నీలో భారత్ మూడు సార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు చేసిన జట్టుగా నిలిచింది.

Advertisement

వివరాలు 

సంజు శాంసన్ సత్తా - విరాట్ కోహ్లీ రికార్డు దాటేశాడు

ఈ వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మొత్తం టోర్నీలో 321 పరుగులు చేసి ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సంజు అధిగమించడం విశేషం. ఫైనల్ మ్యాచ్‌లో సంజు 89 పరుగులు చేసి వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో మార్లన్ శామ్యూల్స్ చేసిన 85 పరుగుల రికార్డు చెరిపోయింది. సంజుతో పాటు అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇషాన్ కిషన్ 54 పరుగులు చేసి అర్ధ సెంచరీలతో కివీస్ బౌలర్లను ఇబ్బంది పెట్టారు.

Advertisement

వివరాలు 

పరుగుల తేడాతో భారీ విజయం

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచిన భారత్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను 159 పరుగులకే పరిమితం చేశారు. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయడమే కాకుండా బౌలింగ్‌లో కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ భారత్ ఏకపక్షంగా మ్యాచ్‌ను గెలుచుకుంది. ఒత్తిడిని తట్టుకోలేక కివీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు.

వివరాలు 

మూడోసారి ప్రపంచ చాంపియన్

ఈ విజయంతో భారత జట్టు తన మూడవ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచంలో మూడు సార్లు ఈ టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా కొత్త రికార్డు నెలకొల్పింది. 2024లో కూడా టైటిల్ గెలిచిన భారత్, ఇప్పుడు మళ్లీ విజయం సాధించి టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలిచింది. గతంలో ఏ జట్టూ సాధించలేని ఈ అరుదైన ఘనతను సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు సాధించింది. అదేవిధంగా సొంత గడ్డపై ఆడుతూ ప్రపంచకప్ గెలిచిన మొదటి ఆతిథ్య దేశంగా కూడా భారత్ నిలిచింది.

వివరాలు 

2027 వరల్డ్ కప్‌ను కూడా భారత్ సొంతం చేసుకోవాలని అభిమానుల ఆశ  

ఇప్పటికే వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ ప్రస్తుతం అద్భుతమైన గోల్డెన్ ఎరాలో కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా గతంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుంటూ, కొత్త రికార్డులతో ప్రపంచ చాంపియన్‌గా నిలవడం భారత క్రికెట్‌కు చారిత్రాత్మక ఘట్టంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2027 వరల్డ్ కప్‌ను కూడా భారత్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ టోర్నీకి టీమిండియా ఎలా సిద్ధమవుతుందో చూడాల్సి ఉంది.

Advertisement