Loading...
Para Asian Games: పారా ఆసియా క్రీడల సంబరం షురూ.. నగోయాలో అట్టహాసంగా ప్రారంభం!
పారా ఆసియా క్రీడల సంబరం షురూ.. నగోయాలో అట్టహాసంగా ప్రారంభం!

Para Asian Games: పారా ఆసియా క్రీడల సంబరం షురూ.. నగోయాలో అట్టహాసంగా ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడా సంబరంలో మరో కీలక ఘట్టం మొదలైంది. జపాన్‌లోని నగోయా వేదికగా ఆదివారం పారా ఆసియా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాబోయే ఆరు రోజుల పాటు పతకాల కోసం క్రీడాకారులు హోరాహోరీగా తలపడనున్నారు. ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత పారా ఆసియా క్రీడల సందడి మొదలైంది. ఆదివారం జరిగిన ఆరంభ వేడుకలు బాణసంచా వెలుగులు, జపాన్ సంస్కృతిని ప్రతిబింబించే కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మొత్తం 168 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 112 మంది పురుషులు కాగా, 56 మంది మహిళలు ఉన్నారు.

వివరాలు

ఈసారి 168మందికే అవకాశం

ఆరంభ వేడుకల్లో నిర్వహించిన కవాతులో 100 మందికి పైగా భారత అథ్లెట్లు పాల్గొన్నారు.

పురుషుల తరఫున షట్లర్ ప్రమోద్ భగత్ పతాకధారిగా వ్యవహరించగా.. మహిళల తరఫున స్ప్రింటర్ సిమ్రన్ శర్మ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందానికి నాయకత్వం వహించింది.

ఆసియా ఖండంలోని 45 దేశాల నుంచి సుమారు 3 వేల మంది పారా అథ్లెట్లు ఈ క్రీడల్లో పోటీపడుతున్నారు. ఈ నెల 24న పోటీలు ముగియనున్నాయి.

గత పారా ఆసియా క్రీడలతో పోలిస్తే ఈసారి భారత్ నుంచి బరిలోకి దిగుతున్న అథ్లెట్ల సంఖ్య తగ్గింది.

గతంలో దాదాపు 300 మంది భారత క్రీడాకారులు పోటీపడగా.. ఈసారి 168 మందికే అవకాశం లభించింది.

వివరాలు

పతకాలు ఎక్కువగా సాధించే అవకాశం

అయినప్పటికీ భారత్ మెరుగైన పతకాల సంఖ్యను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడాంశాల్లో భారత అథ్లెట్లకు పతకాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

గత పారా ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఏకంగా 29 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 111 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.

ఈసారి కూడా అదే స్థాయి ప్రదర్శనతో పతకాల వేటలో సత్తా చాటాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అథ్లెట్లు

ఈ పారా ఆసియా క్రీడల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు క్రీడాకారులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జీవాంజి దీప్తి (400 మీటర్ల పరుగు), అకీరా నందన్ (400 మీటర్ల పరుగు), రవని (400 మీటర్ల పరుగు), రవి రొంగలి (షాట్‌పుట్), షేక్ హర్షద్ (సైక్లింగ్), రవి వీర వెంకట భువన్ (స్విమ్మింగ్) పోటీల్లో పాల్గొననున్నారు.

వీరంతా తమ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసి పతకాలు సాధిస్తారని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

పారా ఆసియా క్రీడల ఆరంభ వేడుకల్లో భారత అథ్లెట్లు ధరించిన బ్లేజర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భారతదేశానికి చెందిన 5 వేల ఏళ్ల చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రత్యేక ఆకర్షణగా భారత అథ్లెట్ల బ్లేజర్లు

భారతీయ నాగరికత గొప్పతనాన్ని చాటేలా బ్లేజర్ల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేశంలోని ఏడు నదుల సంగమాన్ని సూచించేలా బ్లేజర్ కాలర్‌పై సప్త సింధును పొందుపరిచారు.

అలాగే జాతీయ పతాకంలోని మూడు రంగాలతో పాటు సరస్వతిని జేబుపై ముద్రించారు. నీలి రంగు బ్లేజర్లకు జతగా అథ్లెట్లు గోధుమ రంగు ప్యాంట్లను ధరించారు.

భారత చరిత్ర, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ దుస్తులు ప్రారంభోత్సవంలో అందరి దృష్టిని ఆకర్షించాయి.

మొత్తంగా పారా ఆసియా క్రీడలకు ఘనంగా తెరలేవడంతో భారత అథ్లెట్ల పతకాల వేటపై ఆసక్తి నెలకొంది.

గత క్రీడల్లో సాధించిన 111 పతకాల రికార్డును దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా భారత బృందం సత్తా చాటుతుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT