Loading...
Bowling Records: కుంబ్లేకు ముందే 10 వికెట్ల మ్యాజిక్ చేసిన దిగ్గజం.. 'ఆల్-టెన్' క్లబ్‌లో తొలి హీరో ఇతడే!
కుంబ్లేకు ముందే 10 వికెట్ల మ్యాజిక్ చేసిన దిగ్గజం.. 'ఆల్-టెన్' క్లబ్‌లో తొలి హీరో ఇతడే!

Bowling Records: కుంబ్లేకు ముందే 10 వికెట్ల మ్యాజిక్ చేసిన దిగ్గజం.. 'ఆల్-టెన్' క్లబ్‌లో తొలి హీరో ఇతడే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుత రికార్డులు నమోదైనా, ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టులోని 10కి 10 వికెట్లను ఒకే బౌలర్ పడగొట్టడం అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది. దాదాపు 140 ఏళ్లకు పైబడిన టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ అసాధారణ ఫీట్‌ను సాధించిన బౌలర్లు కేవలం ముగ్గురే. ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, న్యూజిలాండ్ ఎడమచేతి స్పిన్నర్ అజాజ్ పటేల్ మాత్రమే ఈ ప్రతిష్ఠాత్మక 'ఆల్-టెన్' క్లబ్‌లో చోటు సంపాదించారు.

వివరాలు

1956లో జిమ్ లేకర్‌తో మొదలైన చరిత్ర

ఈ అరుదైన రికార్డుకు నాంది పలికింది ఇంగ్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్. 1956లో మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆయన అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఆ ఇన్నింగ్స్‌లో కేవలం 53 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్ కోలిన్ మెక్‌డొనాల్డ్ (89 పరుగులు) మినహా మిగతా బ్యాటర్లు జిమ్ లేకర్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక పెవిలియన్ చేరారు.

దీంతో టెస్టు చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జిమ్ లేకర్ చిరస్థాయిగా నిలిచిపోయాడు.

వివరాలు

43 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే చరిత్ర

జిమ్ లేకర్ రికార్డు నమోదైన 43 సంవత్సరాల తర్వాత భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అదే ఘనతను పునరావృతం చేశాడు.

1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో కుంబ్లే విజృంభించాడు.

కేవలం 74 పరుగులు ఇచ్చి పాకిస్థాన్ జట్టులోని 10 వికెట్లన్నింటినీ తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో బౌలర్‌గా, అలాగే తొలి భారతీయుడిగా అనిల్ కుంబ్లే చరిత్ర సృష్టించాడు.

ADVERTISEMENT

వివరాలు

ముంబైలో అజాజ్ పటేల్ అద్భుతం

2021 డిసెంబర్‌లో ఈ అరుదైన జాబితాలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా చేరాడు. ముంబై వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

47.5 ఓవర్లు నిరంతరాయంగా బౌలింగ్ చేసి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లన్నింటినీ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఘనతతో టెస్టు చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మొదటి ఎడమచేతి స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు.

అలాగే న్యూజిలాండ్ తరఫున రిచర్డ్ హాడ్లీ (9/52) పేరిట ఉన్న అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను అధిగమించి, ఆ దేశం తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

ADVERTISEMENT

వివరాలు

ముగ్గురికే సాధ్యమైన అరుదైన ఘనత

టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం అనేది అత్యంత కఠినమైన రికార్డుగా భావిస్తారు.

ఒక బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా, మిగతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయకుండా ఉండటం కూడా దీనికి అవసరం.

అందుకే టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే, అజాజ్ పటేల్ మాత్రమే ఈ అసాధారణ ఘనతను అందుకుని క్రికెట్ చరిత్రలో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు.

ADVERTISEMENT