Asian Para Games 2026: పారా ఆసియా క్రీడల్లో అదే జోరు.. పతకాల సెంచరీకి చేరువలో భారత్!
ఈ వార్తాకథనం ఏంటి
పారా ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. వరుసగా పతకాలు సాధిస్తూ పతకాల సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. పోటీల నాలుగో రోజు భారత అథ్లెట్లు ఏడు స్వర్ణాలు సహా మొత్తం 26 పతకాలను ఖాతాలో వేసుకున్నారు. ఆర్చరీలో శీతల్ దేవి ఒకే రోజు రెండు స్వర్ణాలు సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవికార్తీక్, రవని తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ కాంస్య పతకాలు సాధించారు. దీంతో భారత్ మొత్తం 88 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
వివరాలు
నగోయాలో భారత అథ్లెట్ల పతకాల వేట
పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. నాలుగో రోజైన గురువారం కూడా పతకాల వేటను కొనసాగించారు.
మొత్తం 7 స్వర్ణాలు, 5 రజతాలు సహా 26 పతకాలు సాధించారు. ఈసారి కూడా అథ్లెటిక్స్ విభాగంలోనే భారత్‌కు అత్యధిక పతకాలు లభించాయి.
ఇప్పటివరకు అథ్లెటిక్స్‌లోనే భారత క్రీడాకారులు 18 స్వర్ణాలు సహా మొత్తం 52 పతకాలు సాధించడం విశేషం. ఈ క్రీడలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి.
వివరాలు
హైజంప్‌లో భారత క్లీన్‌స్వీప్.. అథ్లెటిక్స్‌లో పసిడి పంట
పారా ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత ఆధిపత్యం కొనసాగుతోంది.
ఈ విభాగంలో భారత అథ్లెట్లు మరో ఐదు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ63 విభాగంలో భారత క్రీడాకారులు మూడు పతకాలనూ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేశారు.
శైలేశ్ కుమార్ 1.89 మీటర్ల ఎత్తు దూకి క్రీడల రికార్డుతో స్వర్ణ పతకం సాధించాడు. వరుణ్ భాటి 1.84 మీటర్లతో రజతం, రాహుల్ 1.81 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నారు.
స్ప్రింటర్ దిలీప్ గవిత్ మరోసారి సత్తా చాటాడు. ఇప్పటికే బుధవారం జరిగిన 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన అతడు.. గురువారం పురుషుల 400 మీటర్ల టీ47 విభాగంలోనూ పసిడి పతకాన్ని అందుకున్నాడు.
వివరాలు
రెండో స్థానంలో నిలిచిన భవిక్ కుమార్
48.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే పోటీలో 49.31 సెకన్లతో రెండో స్థానంలో నిలిచిన భవిక్ కుమార్.. లేన్ దాటిన కారణంగా అనర్హతకు గురయ్యాడు.
మహిళల 400 మీటర్ల టీ47 విభాగంలో అంజనాబెన్ బూంబాడియా స్వర్ణం సాధించింది. ఆమె 59.97 సెకన్లలో పరుగును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.
భారత్‌కే చెందిన జయంతి బెహ్రా 1 నిమిషం 00.65 సెకన్ల టైమింగ్‌తో రజత పతకాన్ని గెలుచుకుంది.
పురుషుల లాంగ్‌జంప్ టీ44, టీ62, టీ64 విభాగాల్లో ధర్మరాజ్ సొలైరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
7.15 మీటర్ల దూరం దూకి ఆసియా రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ విజయంతో గత క్రీడల్లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
వివరాలు
శీతల్ దేవి స్వర్ణ డబుల్.. ఒకే రోజు రెండు పసిడి పతకాలు
మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో సువర్ణ రాజ్ కూడా పసిడితో మెరిసింది. ఆమె 15.66 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
భారత ఆర్చర్ శీతల్ దేవి పారా ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పారా ఆర్చరీ పీ12 విభాగంలో ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించింది.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో విజేతగా నిలిచి తన సత్తా చాటింది.
ప్రపంచ ఛాంపియన్ అయిన శీతల్ దేవి వ్యక్తిగత విభాగంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సింగపూర్‌కు చెందిన అలిమ్ నూర్ స్యాహిదాపై 142-139తో విజయం సాధించింది.
పోటీ మధ్యలో ఒక దశలో నాలుగు పాయింట్లు వెనుకబడినప్పటికీ ఆమె పట్టుదలతో పోరాడి విజయాన్ని అందుకుంది.
వివరాలు
మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ స్వర్ణం
రెండు చేతులు లేకపోయినా కాళ్ల సాయంతో బాణాలు సంధించే 19 ఏళ్ల శీతల్.. మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ స్వర్ణం సాధించింది.
పాయల్ నాగ్, తోమన్ కుమార్, శ్యామ్‌సుందర్‌లతో కలిసి బరిలోకి దిగిన ఆమె.. ఫైనల్లో ఇండోనేసియా జట్టుపై 151-148తో విజయం సాధించి భారత జట్టుకు పసిడి పతకాన్ని అందించింది.
ఈ క్రీడల్లో శీతల్‌కు ఇది మూడో పతకం. ఇంతకుముందు పాయల్ నాగ్‌తో కలిసి మహిళల టీమ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది.
మరోవైపు భారత ఆర్చర్ స్వాతి కూడా చరిత్ర సృష్టించింది. డబ్ల్యూ1 విభాగంలో పతకం సాధించిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది.
అయితే ఫైనల్లో చైనాకు చెందిన సెన్ మెంగ్‌కన్ చేతిలో 4-6తో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది.
వివరాలు
కార్తీక్ హ్యాట్రిక్.. రవనికి మరో కాంస్యం
టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన స్వాతి గత నెలలో జరిగిన ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్‌లో కాంస్య పతకం సాధించింది.
నడుము కింది భాగం పనిచేయని క్రీడాకారులు డబ్ల్యూ1 విభాగంలో పోటీపడతారు. పారా ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవికార్తీక్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే రెండు రజత పతకాలు సాధించిన అతడు.. గురువారం మరో కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ క్రీడల్లో మూడు పతకాలతో హ్యాట్రిక్ నమోదు చేశాడు.
పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో రవికార్తీక్ మూడో స్థానంలో నిలిచాడు.
18 ఏళ్ల ఈ స్విమ్మర్ 25.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకాన్ని అందుకున్నాడు. చూపు సరిగా లేని స్విమ్మర్లు పాల్గొనే విభాగం ఇది.
వివరాలు
ఫ్రీస్టైల్ ఈవెంట్లలో రజత పతకం
ఇంతకుముందు అతడు 100 మీటర్ల ఎస్13 బ్యాక్‌స్ట్రోక్, ఫ్రీస్టైల్ ఈవెంట్లలో రజత పతకాలు సాధించాడు.
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రవని వలసనైని కూడా మరో పతకాన్ని సాధించింది. మహిళల 400 మీటర్ల టీ11 పరుగులో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
రవని 1 నిమిషం 03.64 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ క్రీడల్లో ఆమెకు ఇది రెండో పతకం. ఇంతకుముందు 1500 మీటర్ల టీ11 పరుగులోనూ కాంస్యాన్ని సాధించింది.
ఇలా నాలుగో రోజు అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్ విభాగాల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మరో రెండు రోజుల పోటీలు మిగిలి ఉండటంతో భారత్ పతకాల సంఖ్య 100 దాటుతుందనే అంచనాలు నెలకొన్నాయి.