రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని స్టార్ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గత ఆదివారం నుంచి దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మళ్లీ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వినేశ్ ఫొగాట్‌తో సహా ఏడుగురు రెజ్లర్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయం "తీవ్రమైనది" దానిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. రెజ్లర్ల పిటీషన్ పై డివై. చంద్రచూడ్ నేతృత్వంలో నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ని అరెస్టు చేయాలి
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బాధితులను బెదిరిస్తున్నారని రెజ్లర్లు ఆరోపించారు. బిజెపి ఎంపి అయిన బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తాము నిరసన వేదికను విడిచిపెట్టబోమని రెజ్లర్లు తేల్చి చెప్పారు. ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతుందని, ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి మంచిది కాదని, ఏదైనా చట్టప్రకారం ఉండాలని, రాజకీయ పార్టీల మద్దతు కోరడం తనను నిరాశపరిచిందని పీటీ ఉష స్పష్టం చేసింది. నిరసన తెలిపిన రెజ్లర్లందరికీ ప్రభుత్వం తమ వాదనను పర్యవేక్షణ కమిటీ ముందు సమర్పించడానికి అవకాశం కల్పించిందని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై "నిష్పాక్షిక విచారణ"కు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.