Loading...
IND vs WI: చివరి సమరానికి వేళాయె.. భారత్‌దా? విండీస్‌దా? సిరీస్‌ ఎవరిదో!
చివరి సమరానికి వేళాయె.. భారత్‌దా? విండీస్‌దా? సిరీస్‌ ఎవరిదో!

IND vs WI: చివరి సమరానికి వేళాయె.. భారత్‌దా? విండీస్‌దా? సిరీస్‌ ఎవరిదో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య హోరాహోరీగా సాగుతున్న టీ20 సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే నిర్ణయాత్మక ఐదో టీ20లో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం సిరీస్‌ 2-2తో సమంగా ఉండటంతో చివరి మ్యాచ్‌లో గెలిచే జట్టుకే సిరీస్‌ దక్కనుంది. వెస్టిండీస్‌ అంచనాలకు మించి దూకుడుగా ఆడుతుండటంతో టీమ్‌ఇండియాకు ఈ పోరు సవాలుగా మారింది. కరీబియన్లపై పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే శ్రేయస్‌ సేన బ్యాటింగ్‌లో జోరు పెంచాల్సిన అవసరం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనూ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో రెండు విజయాలు సాధించాయి.

వివరాలు

బ్యాటర్లు ఏం చేస్తారో!

నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న పోరులో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించడంతో చివరి టీ20పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, భారత జట్టు ఫాస్ట్‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను అదనంగా జట్టులోకి తీసుకుంది.

చివరి టీ20లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

సిరీస్‌ సమంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు శ్రేయస్‌ సేన బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జట్టును నిలకడలేమి సమస్య వేధిస్తోంది.

వివరాలు

బలమైన ఆరంభాలు అవసరం

ఈ ఇబ్బంది ఓపెనింగ్‌ నుంచే మొదలవుతోంది. ఓపెనర్లు సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ కలిసి ఇప్పటివరకు మూడు అర్ధశతకాలు సాధించినప్పటికీ.. జోడీగా జట్టుకు బలమైన ఆరంభాలు అందించడంలో విఫలమయ్యారు.

ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌ల్లో తొలి వికెట్‌కు వీరిద్దరూ వరుసగా 29, 42, 7, 60 పరుగులు జోడించారు.

హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో నమోదైన 60 పరుగుల భాగస్వామ్యంలో సంజు శాంసన్‌ ఒక్కడే 56 పరుగులు చేశాడు. అభిషేక్‌ శర్మ బ్యాట్‌ నుంచి కేవలం రెండు పరుగులే వచ్చాయి.

ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసిన తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ కూడా జట్టును ఆదుకోలేకపోయింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌, నమన్‌ ధీర్‌ మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమయ్యారు.

ADVERTISEMENT

వివరాలు

మిడిల్ ఆర్డర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు ఓపెనర్ల నుంచి బలమైన పునాది అవసరం. అదే సమయంలో మిడిల్‌ ఆర్డర్‌ కూడా బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది.

లఖ్‌నవూలో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శ్రేయస్‌.. ఆ తర్వాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 40, 1, 16 పరుగులే చేశాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో అతడు మళ్లీ బ్యాట్‌తో మెరవాల్సిన అవసరం ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతే కెప్టెన్‌గా కూడా శ్రేయస్‌ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు, ఇషాన్‌ కిషన్‌ భారీ ఇన్నింగ్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

అతడు మంచి లయలోనే ఉన్నప్పటికీ, అనవసర సాహసాలకు వెళ్లి వికెట్‌ కోల్పోతున్నాడు. కీలకమైన చివరి మ్యాచ్‌లో ఇషాన్‌ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

అశించిన స్థాయిలో రాణించలేకపోతున్న నమన్ ధీర్

ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్‌ కూడా తనకు లభించిన అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాడు.

గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడు వరుసగా 4, 10, 0 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనైనా తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.

తెలుగు ఆటగాళ్లు తిలక్‌ వర్మ, నితీశ్‌ గత మ్యాచ్‌లో మెరిసినప్పటికీ.. ఒక దశలో 18 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయారు.

చివరి మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవడం భారత జట్టుకు కీలకం కానుంది.

వివరాలు

జట్టులోకి భువనేశ్వర్‌ కుమార్‌!

దూకుడుగా ఆడుతున్న వెస్టిండీస్‌ బ్యాటర్లను కట్టడి చేయాలంటే భారత బౌలింగ్‌ విభాగం కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బౌలర్లకు పరీక్ష తప్పదు.

నాలుగో టీ20 సందర్భంగా భుజం గాయానికి గురైన అర్ష్‌దీప్‌ సింగ్‌ చివరి మ్యాచ్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

దీంతో ముందుజాగ్రత్త చర్యగా భువనేశ్వర్‌ కుమార్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్‌కు దూరమైతే భువనేశ్వర్‌ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.

అలా జరిగితే మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌లతో కలిసి భువనేశ్వర్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను పంచుకోనున్నాడు.

వివరాలు

ధీమాగా వెస్టిండీస్‌.. హోప్‌, రూథర్‌ఫర్డ్‌ భీకర ఫామ్‌!

స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌ స్పిన్‌ బౌలింగ్‌ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

వన్డే సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన వెస్టిండీస్‌.. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ అద్భుతంగా రాణిస్తోంది. దీంతో కరీబియన్‌ జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది.

కెప్టెన్‌ షాయ్‌ హోప్‌, రూథర్‌ఫర్డ్‌ భీకర ఫామ్‌ ఆ జట్టుకు ప్రధాన బలంగా మారింది.

ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన షాయ్‌ హోప్‌ 261 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 190.51గా ఉంది.

వివరాలు

221 పరుగులతో రెండో స్థానం

మరోవైపు, రూథర్‌ఫర్డ్‌ 221 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 188.88గా ఉంది. వీరితో పాటు హెట్‌మయర్‌, పావెల్‌, షెపర్డ్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు కూడా వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ఉన్నారు.

దీంతో భారీ స్కోర్లు సాధించే సామర్థ్యం కరీబియన్‌ జట్టుకు ఉంది. బౌలింగ్‌లోనూ వెస్టిండీస్‌ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.

ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు విండీస్‌ ఆటగాళ్లకే దక్కాయి.

కీమో పాల్‌, చేజ్‌ చెరో ఆరు వికెట్లు పడగొట్టారు. కీలకమైన చివరి టీ20 కోసం వెస్టిండీస్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు.

వివరాలు

మ్యాచ్‌కు వర్షం ముప్పు!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా పేరొందింది. దీంతో చివరి టీ20లోనూ పరుగుల వరద పారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే నగరంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశముంది.

భారత్‌, వెస్టిండీస్‌ తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్‌, నితీశ్‌, అక్షర్‌ పటేల్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌/భువనేశ్వర్‌ కుమార్‌.

వెస్టిండీస్‌: షాయ్‌ హోప్‌, ఆండ్రూ, హెట్‌మయర్‌, పావెల్‌, రూథర్‌ఫర్డ్‌, షెఫర్డ్‌, చేజ్‌, స్ప్రింగర్‌, కీమో పాల్‌, షామర్‌ జోసెఫ్‌, మోటీ.

ADVERTISEMENT