75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు
మీడియా హక్కుల వేలం, రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ విలువ ఆమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది 75శాతం వృద్ధిని నమోదు చేసి.. ఏకంగా 10.9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టింగ్, అడ్వైజరీ సేవల ఏజెన్సీ 'డీ అండ్ పీ' పేర్కొంది. బుధవారం వాల్యుయేషన్ రిపోర్ట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. గతేడాది దీని విలువ 6.2బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రారంభమైన 15ఏళ్లలోనే 10బిలియన్ డాలర్ల విలువకు చేరుకోని సంచలనం సృష్టించింది ఐపీఎల్. ఈఏడాది మీడియా హక్కుల వేలం 6.2 బిలియన్ డాలర్లు పలికింది. రెండు కొత్త జట్ల విలువను 1.6 బిలియన్ డాలర్లుగా మదింపు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించింది.
రూపాయి పతనం వల్ల తగ్గిన విలువ
వాస్తవానికి ఏడాది ఉన్న విలువకు ఈ ఏడాది మీడియా హక్కులు, రెండు జట్లు రావడంతో.. ఐపీఎల్ మొత్తం విలువ 12 బిలియన్ డాలర్లను దాటుతుంది. అయితే రూపాయి విలువ పతనం వల్ల.. విలువను సవరించి.. 10.9 బిలియన్ డాలర్లుగా డీ అండ్ పీ అంచనాకు వచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ విలువ 400-600 మిలియన్ డాలర్లుగా (రూ.5,000 కోట్ల వరకు) ఉండొచ్చని డీ అండ్ పీ అడ్వైజరీ మేనేజింగ్ పార్ట్ నర్ సంతోష్ పేర్కొన్నారు. 2008లో ప్రారంభించినప్పటి నుంచి.. ఐపీఎల్ ఇప్పటికే అనేక మైలురాళ్లను అధిగమించింది. తాజాగా 10.9 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరి.. మరో మజిలీని చేరుకుంది.