Vinesh Phogat: నేను గెలుస్తాననే భయం వాళ్లకు ఉంది.. డబ్ల్యూఎఫ్‌ఐపై వినేశ్ ఫొగాట్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా అడ్డుకోవడమే డబ్ల్యూఎఫ్‌ఐ లక్ష్యమని ఆమె విమర్శించారు. తాను మళ్లీ పతకాలు గెలుస్తాననే భయంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పోటీలో పాల్గొనేందుకు వినేశ్ తాజాగా గొండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌తో ఆమె సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో వినేశ్ మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హతకు గురైన తర్వాత తన జీవితంలో ఆనందం పూర్తిగా కోల్పోయానని చెప్పారు.
వివరాలు
14 రోజులు గడువు ఇచ్చారు
అయితే తన కుమారుడు క్రిధవ్ వల్ల తిరిగి జీవితంలో ఉత్సాహం వచ్చిందని, వ్యవస్థపై పోరాడే ధైర్యం కూడా అతడే ఇచ్చాడని పేర్కొన్నారు. తనకు శుక్రవారం రాత్రి డబ్ల్యూఎఫ్‌ఐ నుంచి నోటీసు అందిందని, దానికి సమాధానం ఇచ్చేందుకు 14 రోజుల గడువు ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌కు కూడా వివరించినట్లు చెప్పారు. సమయం తక్కువగా ఉండటంతో నోటీసుకు క్లుప్తంగా మాత్రమే సమాధానం ఇచ్చాను. ముందుగా నన్ను పోటీలో పాల్గొననివ్వండి. 14 రోజుల తర్వాత కూడా నా సమాధానంతో సంతృప్తి చెందకపోతే చర్యలు తీసుకోండి అని కోరానని వినేశ్ వెల్లడించారు.
వివరాలు
నేను రిటైర్ కావాలని కోరుకుంటున్నారు
అయితే దీనికి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు అంగీకరించలేదని ఆమె తెలిపారు. పూర్తి స్థాయి వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కోరారని, 14 నుంచి 15 రోజుల తర్వాత కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారన్నారు. నేను మళ్లీ పతకాలు గెలుస్తాననే భయం వారికి ఉంది. అసలు డబ్ల్యూఎఫ్‌ఐ నన్ను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలని చూస్తోంది. నేను రిటైర్ కావాలని వారు కోరుకుంటున్నారంటూ వినేశ్ ఫొగాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.