Jakob Ingebrigtsen: 'వాళ్లంతా పిరికివాళ్లే'.. ప్రత్యర్థులపై జాకబ్ ఇంగెబ్రిగ్ట్సెన్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో ఓటమితో ఒలింపిక్ పతక విజేత, నార్వే అథ్లెట్ జాకబ్ ఇంగెబ్రిట్‌సెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన ప్రత్యర్థులపై పరుష వ్యాఖ్యలు చేస్తూ.. వారంతా మూర్ఖులు, పిరికిపందలు అంటూ విమర్శలు చేశాడు. బ్రస్సెల్స్ వేదికగా డైమండ్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో 1500 మీటర్ల రేసులో జాకబ్ ఇంగెబ్రిట్‌సెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రేసు చివరి వరకు దాదాపు అగ్రస్థానంలో కొనసాగిన అతడు.. ఫినిషింగ్ లైన్‌కు చేరువగా ఒక్కసారిగా వెనుకబడిపోయాడు. దీంతో టాప్-3లో కూడా నిలవలేకపోయాడు. ఆస్ట్రేలియా అథ్లెట్ మేయర్స్ కామెరూన్ 3:30.14 నిమిషాలతో తొలి స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన కోయిచ్ ఫన్యూయెల్ 3:30.18తో రెండో స్థానం, అమెరికా అథ్లెట్ స్ట్రాండ్ ఇథన్ 3:30.50తో మూడో స్థానంలో నిలిచారు.
వివరాలు
ఇదంతా ప్రత్యర్థుల వ్యూహంలో భాగమే
చివరి 30 మీటర్లకు వచ్చేసరికి ప్రత్యర్థులు ఒక్కసారిగా తనకు అడ్డుగా పరిగెత్తినట్లు అతడు ఆరోపించాడు.
''నా ప్రత్యర్థులంతా పిరికిపందలు. వారంతా ఓ క్యూ లైన్ మాదిరిగా పరిగెత్తాలని భావించారు. ఒకరి వెనుక ఒకరు దాక్కున్నారు. చివర్లో నా ముందు ఉన్న రన్నర్ సరిగ్గా పరిగెత్తకపోవడంతో నేను నా లైన్ తప్పాల్సి వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాలని నేను అనుకోలేదు. కానీ, చివరికి తప్పలేదు. ఇదంతా ప్రత్యర్థుల వ్యూహంలో భాగమే. తమ సొంత టీమ్‌మేట్ కోసం వారు అలా చేశారు.
కొంతమంది పిరికివాళ్లతో పోటీ పడ్డాను. తొలి స్థానంలో నిలిచిన కామెరూన్ మాత్రమే కాస్త మంచి రేసర్‌లా కనిపించాడు. మిగతావారంతా ఓడిపోయినవారేననని జాకబ్ ఇంగెబ్రిట్‌సెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.