Page Loader
WTC Final: 'చోకర్స్‌' అంటూ మాటల దాడి చేశారు : బవుమా కీలక వ్యాఖ్యలు
'చోకర్స్‌' అంటూ మాటల దాడి చేశారు : బవుమా కీలక వ్యాఖ్యలు

WTC Final: 'చోకర్స్‌' అంటూ మాటల దాడి చేశారు : బవుమా కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచకప్‌లలో అనేకసార్లు ఘోర పరాజయాలతో 'చోకర్స్‌' ముద్రలో కూరుకుపోయిన దక్షిణాఫ్రికా.. చివరకు ఆ ముద్రను తుడిచేసే ఘనత సాధించింది. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఐసీసీ టైటిల్స్‌ వేటలో 27 ఏళ్ల గ్యాప్‌కు చెక్‌ పెడుతూ చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. అయితే ఈ గెలుపు వెనుక ఉన్న ఓ వివాదస్పద ఘట్టాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవూమా బయటపెట్టాడు. మ్యాచ్‌ నాలుగో రోజు ఆసీస్‌ ఆటగాళ్లు తమపై స్లెడ్జింగ్‌కు దిగారని ఆయన ఆరోపించారు. తమ జట్టు విజయ దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఆసీస్‌ ఆటగాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడారని బవూమా ఆవేదన వ్యక్తం చేశారు.

Details

చోకర్స్ అంటూ హేళన చేశారు

తనతో పాటు మార్క్రమ్ కలిసి జట్టును ముందుకు నడిపిస్తుండగా, ఆ ఏకాగ్రతను చెడగొట్టేందుకు ప్రత్యర్థులు అన్ని మార్గాలు ప్రయత్నించారని పేర్కొన్నారు. 'నాకు బ్యాటింగ్ చేస్తుండగా 'చోకర్స్‌' అనే మాటలు వినిపించాయి. ఆ పదం ఎంతో అసహ్యం. కానీ మేము నమ్మకంగా ఈ మ్యాచ్‌ ఆడేందుకు వచ్చాం. మాపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ మా ఆటతీరు వాటన్నింటినీ తుడిచేసింది. ఈ విజయం మా దేశానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని బవూమా మీడియాతో అన్నాడు. ఈ విషయంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ స్పందిస్తూ, ''చోకర్స్‌ ట్యాగ్‌ మమ్మల్ని చాలాకాలంగా వెంబడిస్తోంది. అయితే ఇప్పుడు అది చరిత్రలో కలిసిపోయింది.

Details

కొత్త అధ్యాయనం ప్రారంభం

ఈ గెలుపుతో మేము కొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఆసీస్‌ పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ల్లో ఆసీస్‌ స్లెడ్జింగ్‌కు దిగడం కొత్తేమీ కాదు. పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలో కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపించినా.. ఇలా మరోసారి ప్రవర్తనలోని పాత పద్ధతులు బయటపడటంపై విమర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. WTC ఫైనల్‌ లాంటి వేదికపై స్పోర్ట్స్‌మెన్‌షిప్‌కు భంగం కలిగించే చర్యలకు ఆసీస్‌ దిగడం బాధాకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.