IND vs NZ: నేడే భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. సిరీస్‌పై టీమిండియా కన్ను, కివీస్‌కు డూ ఆర్ డై!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండు విజయాలు సాధించి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఇప్పుడు మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. వెల్లింగ్టన్‌లోని హెచ్‌ఎన్‌ఆర్‌వై స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌కు విజయం తప్పనిసరిగా మారింది. సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కివీస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.
వివరాలు
2026లో భారత్ టీ20 ప్రయాణం.. ఎన్నో మలుపులు!
2026లో భారత టీ20జట్టు ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది.
ఏడాది ఆరంభంలో టీ20ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న భారత్.. వరుసగా రెండు ప్రపంచకప్ ఎడిషన్లలో టైటిల్ సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
ఈరెండు ప్రపంచకప్ టోర్నీల్లో కలిపి టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. అయితే ప్రపంచకప్ విజయానంతరం పరిస్థితులు కొంత మారాయి.
కెప్టెన్సీలో మార్పు నేపథ్యంలో ఐర్లాండ్ పర్యటనలో భారత్ 0-2తో సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోనూ సిరీస్ పరాజయం ఎదురైంది.
స్వదేశంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లేకుండా వెస్టిండీస్‌తో ఆడిన సిరీస్‌ను భారత్ 2-2తో ముగించింది.
ఇప్పుడు న్యూజిలాండ్‌లోని బౌన్సీ పిచ్‌లు, బలమైన గాలుల మధ్య కూడా బుమ్రా, హార్దిక్ లేకుండానే టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.
వివరాలు
వెల్లింగ్టన్‌లో గాలుల ప్రభావం.. బౌలర్లకు సవాల్!
తొలి మ్యాచ్‌కు ముందు ఒక్క ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌పై వరుసగా రెండు విజయాలు సాధించింది.
అంతేకాకుండా కివీస్‌తో ఆడిన గత పది టీ20 మ్యాచ్‌ల్లో భారత్ తొమ్మిదింటిలో విజయం సాధించడం విశేషం. క్రైస్ట్‌చర్చ్‌తో పోలిస్తే వెల్లింగ్టన్‌లో గాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అయితే మైదానంలోని స్క్వేర్ బౌండరీలు సుమారు 60 మీటర్ల దూరంలోనే ఉండటం బ్యాటర్లకు కొంత అనుకూలంగా మారనుంది.
ఈ పరిస్థితులకు అనుగుణంగా బౌలర్లు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేశారు.
అదే సమయంలో న్యూజిలాండ్ ఫీల్డర్లు చేసిన తప్పిదాలను టీమిండియా బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు.
వివరాలు
కీలక పేసర్లు దూరం.. కివీస్‌కు ఎదురుదెబ్బ!
ఇప్పుడు వెల్లింగ్టన్ మైదానంలో గాలుల దిశ, బౌండరీల కొలతలను దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ వ్యూహాల్లో మార్పులు చేయడం కీలకం కానుంది.
మూడో టీ20కి ముందు న్యూజిలాండ్‌కు కీలక ఆటగాళ్ల దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పేసర్ మాట్ హెన్రీ గత మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
ఇతర ఫార్మాట్లలో ఆడాల్సి ఉండటంతో అతడిని మిగిలిన సిరీస్ నుంచి తప్పించారు. మరోవైపు లాకీ ఫెర్గూసన్ మూడో టీ20కు అందుబాటులో ఉండడు.
దీంతో పేస్ విభాగంలో ఆడమ్ మిల్నే, బ్లెయిర్ టిక్నర్‌తో పాటు ఈ మ్యాచ్‌లో కైల్ జేమీసన్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
భారత బ్యాటర్లను కట్టడి చేయాలంటే వీరు తమ బౌలింగ్‌లో కచ్చితత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.
వివరాలు
భారత బ్యాటర్లకు సాంట్నర్, బ్రేస్‌వెల్ స్పిన్ పరీక్ష!
న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లకు గట్టి సవాల్ విసిరారు. వీరిద్దరూ కలిపి 16 ఓవర్లలో 132 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టారు.
దీంతో మూడో టీ20లోనూ వీరి బౌలింగ్ కీలకం కానుంది. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ సిరీస్‌లో స్పిన్నర్లపై అతడి స్ట్రైక్‌రేట్ 76గా ఉండగా.. పేసర్లపై మాత్రం 220గా ఉంది. పేస్ బౌలింగ్‌పై దూకుడుగా ఆడుతున్న తిలక్.. స్పిన్నర్లను ఎదుర్కొనే విధానాన్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
అయితే సంజూ శాంసన్, నమన్ ధీర్ స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతున్నారు. వీరి ప్రదర్శన భారత్‌కు కీలకం కానుంది.
వివరాలు
భారత తుది జట్టులో మార్పులు ఉంటాయా?
మూడో టీ20 కోసం భారత జట్టు కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఇషాన్ కిషన్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం లభించే సూచనలు ఉన్నాయి.
అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా జట్టులో కొనసాగించే అవకాశముంది.
అతడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 19వ ఓవర్‌ను సమర్థంగా బౌలింగ్ చేసి జట్టుకు కీలకంగా నిలిచాడు.
దీంతో అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనపై మరోసారి ఆసక్తి నెలకొంది.
వివరాలు
తిలక్ వర్మపై ప్రత్యేక దృష్టి.. అర్ష్‌దీప్‌కు రికార్డు ఛాన్స్!
మూడో టీ20లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. ఇప్పటివరకు అతడు టీ20ల్లో 26 ఛేజింగ్‌లలో నాటౌట్‌గా నిలిచాడు.
విశేషమేమిటంటే, ఆ 26 మ్యాచ్‌ల్లోనూ అతడి జట్టు విజయం సాధించింది. ఈ ప్రత్యేక రికార్డు నేపథ్యంలో మరోసారి లక్ష్య ఛేదనలో అతడు కీలక పాత్ర పోషిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా రికార్డుకు చేరువలో ఉన్నాడు. 2026లో ఇప్పటివరకు అతడు 38 టీ20 వికెట్లు పడగొట్టాడు.
వివరాలు
ఒక్క వికెట్ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
ఒక క్యాలెండర్ ఏడాదిలో ఫుల్ మెంబర్ దేశానికి చెందిన బౌలర్‌గా అత్యధిక టీ20 వికెట్లు సాధించిన రికార్డును అందుకోవడానికి అతడు కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.
దీంతో మూడో టీ20లో అర్ష్‌దీప్ మరో వికెట్ తీస్తే చారిత్రక ఘనత సాధించే అవకాశం ఉంది.
ఒకవైపు భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, మరోవైపు న్యూజిలాండ్ పోరాటానికి సిద్ధమవుతోంది.
తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ రికార్డులపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.