Vaibhav Sooryavanshi: కెప్టెన్ తిలక్ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత
ఈ వార్తాకథనం ఏంటి
త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అతడు కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదిన వైభవ్ దాదాపు 324 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వర్షం కురిపించాడు. సెంచరీకి చేరువలో ఉన్నప్పటికీ మూడు అంకెల మైలురాయిని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ తన పేలవైన బ్యాటింగ్‌తో కెప్టెన్ తిలక్ వర్మ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు.
వివరాలు
తిలక్ వర్మ ఏం చెప్పాడంటే..
మ్యాచ్‌కు ముందు 'స్పోర్ట్‌స్టార్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ వర్మ, వైభవ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపాడు. ఒత్తిడికి లోనుకాకుండా సహజమైన ఆటను కొనసాగించాలని, ఆటను ఆస్వాదిస్తూ తన ప్రతిభను ప్రదర్శించాలని అతడికి సూచించినట్లు వెల్లడించాడు. చిన్న వయసులోనే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదగాల్సిన అవసరం ఉందని, ఇప్పటివరకు అతడు సాధించిన విజయాలన్నీ సానుకూల దృక్పథంతో ఆడిన ఫలితమేనని పేర్కొన్నాడు. ఫైనల్‌లో వైభవ్ తప్పకుండా ప్రభావం చూపిస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తిలక్, అతడు ఒకసారి క్రీజులో నిలదొక్కుకుంటే ఒంటిచేత్తోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాడని ప్రశంసించాడు. తిలక్ చెప్పినట్లుగానే వైభవ్ భారీ ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
వివరాలు
వైభవ్ మరో అరుదైన ఘనత..
ఈ టైటిల్ పోరులో వైభవ్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ 'ఎ' క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అతని తొలి 50 పరుగులు 5 ఫోర్లు, 5 సిక్సర్ల ద్వారానే రావడం విశేషం. ఈ దశలో ఒక్క సింగిల్ లేదా డబుల్ కూడా తీయకుండా మొత్తం పరుగులన్నీ బౌండరీల ద్వారానే నమోదు చేశాడు. కేవలం ఒక బంతిని మాత్రమే డాట్‌గా వదిలిన వైభవ్, ఆ సమయంలో 450కు పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేయడం అతడి దూకుడుకు నిదర్శనంగా నిలిచింది.