Loading...
Vithya Ramraj: పీటీ ఉష రికార్డు బద్దలుకొట్టి.. ఆసియా క్రీడల్లో విద్య రామ్‌రాజ్‌ సంచలనం
పీటీ ఉష రికార్డు బద్దలుకొట్టి.. ఆసియా క్రీడల్లో విద్య రామ్‌రాజ్‌ సంచలనం

Vithya Ramraj: పీటీ ఉష రికార్డు బద్దలుకొట్టి.. ఆసియా క్రీడల్లో విద్య రామ్‌రాజ్‌ సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

400 మీటర్ల హర్డిల్స్‌ అనగానే భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష పేరు గుర్తుకొస్తుంది. ఈ విభాగంలో ఆమె సాధించిన ఘనతలు అలాంటివి మరి. ఇప్పుడు జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మరోసారి ఉష పేరు వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె రికార్డును బద్దలు కొట్టిన విద్య రామ్‌రాజ్‌ కారణంగా. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విద్య రామ్‌రాజ్‌ కాంస్య పతకం సాధించింది. 54.75 సెకన్లతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన ఆమె.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న పీటీ ఉష జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 1984 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో ఉష 55.42 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు ఇన్నాళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది.

వివరాలు

పేద కుటుంబం నుంచి.. అథ్లెటిక్స్‌ వైపు

ఇప్పుడు 54.75 సెకన్లతో విద్య ఆ రికార్డును అధిగమించింది. ఈ ఆసియా క్రీడల్లో విద్యకు ఇది రెండో పతకం. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో రజతం సాధించిన భారత జట్టులోనూ ఆమె సభ్యురాలిగా ఉంది.

తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన విద్య రామ్‌రాజ్‌ పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

విద్య తల్లి మాత్రం తన పిల్లలకు ఏదో ఒక క్రీడ నేర్పించాలని భావించారు. అయితే క్రీడా శిక్షణకు అయ్యే ఖర్చులను భరించే స్థోమత ఆ కుటుంబానికి లేకపోయింది.

దీంతో విద్య, ఆమె కవల సోదరి నిత్యను క్రీడా ప్రాధికార సంస్థ హాస్టల్‌లో చేర్పించారు. అక్కడే కోచ్‌ నేహాపాల్‌ సింగ్‌ ప్రోత్సాహంతో విద్య అథ్లెటిక్స్‌ను ఎంచుకుంది.

వివరాలు

ఒలింపిక్స్‌లోనూ భారత జట్టులో సభ్యురాలు

తొలినాళ్లలో 100, 200 మీటర్ల పరుగులపై దృష్టి పెట్టిన ఆమె.. 2017లో 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. విద్య కవల సోదరి నిత్య కూడా స్ప్రింట్‌లో రాణించింది.

ఆ తర్వాత పటియాలా జాతీయ శిబిరానికి ఎంపిక కావడం అక్కాచెల్లెళ్లను అథ్లెటిక్స్‌లో మరింత రాటుదేలేలా చేసింది.

2022 ఆసియా క్రీడల్లో 4×400 మీటర్ల రిలే విభాగాల్లో రజత పతకాలు సాధించిన భారత జట్లలో విద్య రామ్‌రాజ్‌ సభ్యురాలిగా ఉంది.

అదే ఆసియా క్రీడల్లో 400 మీటర్ల హర్డిల్స్‌లోనూ ఆమె కాంస్య పతకం గెలుచుకుంది.

ADVERTISEMENT

వివరాలు

భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత 4×400 మీటర్ల రిలే జట్టులోనూ విద్య రామ్‌రాజ్‌ చోటు దక్కించుకుంది.

ఇప్పుడు జపాన్‌ ఆసియా క్రీడల్లో 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం సాధించడంతో పాటు.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న పీటీ ఉష జాతీయ రికార్డును బద్దలు కొట్టి తన పేరును భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో సుస్థిరం చేసుకుంది.

ADVERTISEMENT