LOADING...
Virat Kohli: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం!
భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం!

Virat Kohli: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 04, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ ఆడనున్న వన్డే సిరీస్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం వెలువడుతోంది. తొడ కండరాల గాయంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు పీటీఐ నివేదించింది. ఈ పరిణామం భారత జట్టుకు పెద్ద షాక్‌గా భావిస్తున్నారు. జూన్ 13 నుంచి 20 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా కోహ్లీ ఈ గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

వివరాలు

అద్భుత ఫామ్‌లో కోహ్లీ..

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ కీలక పోరులో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 42 బంతులు ఎదుర్కొన్న అతడు 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఐదు వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే మ్యాచ్ చివరి దశలో పరుగులు తీసే సమయంలో కోహ్లీ కొంత అసౌకర్యంగా కనిపించినప్పటికీ, ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ముగించాడు. మొత్తం ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. 16 మ్యాచ్‌ల్లో 56.25 సగటు, 165.85 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు నమోదు చేసి తన బ్యాటింగ్ ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.

వివరాలు

కోహ్లీకి గాయం..

ఈ అద్భుత ఫామ్‌ను ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో కూడా కొనసాగిస్తాడని అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆశించాయి. అలాగే 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలను మరింత బలపర్చుకోవాలనే లక్ష్యంతో కోహ్లీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో గాయం కారణంగా అతని అందుబాటుపై అనిశ్చితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గాయం తీవ్రత ఎంత మేరకు ఉంది? ఆఫ్ఘన్ సిరీస్‌కు కోహ్లీ పూర్తిగా దూరమవుతాడా? అనే విషయాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement