BCCI: ఇకపై సీనియర్ సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశాలన్నింటికీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరుకానున్నారు. సెలెక్టర్లు, సీఓఈ మధ్య సమన్వయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే ఈ నిర్ణయం ఉద్దేశమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
వివరాలు
సెలెక్టర్లకు ఆటగాళ్లపై పూర్తి సమాచారం
క్రికెట్ వ్యవహారాల అధిపతిగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ఇకపై అన్ని సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటారని దేవజిత్ సైకియా వెల్లడించారు.
సెలెక్టర్లు, సీఓఈ మధ్య అపార్థాలు లేదా సమాచార లోపాలు లేకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఆటగాళ్ల ప్రస్తుత పరిస్థితిపై సెలెక్టర్లకు కచ్చితమైన సమాచారం అందినప్పుడే జట్టు ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సైకియా పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలు, తిరిగి జట్టులోకి వచ్చే అంశాలపై స్పష్టమైన సమాచారం సెలెక్టర్లకు అందడం కీలకమని తెలిపారు.
వివరాలు
అగార్కర్ హయాంలో కమ్యూనికేషన్‌పై చర్చ
ఇప్పటివరకు వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సరైన స్థాయిలో కమ్యూనికేషన్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా గాయపడిన ఆటగాళ్ల ఫిట్‌నెస్, వారు తిరిగి పోటీల్లోకి వచ్చే అంశాలపై సీఓఈ నుంచి సెలెక్టర్లకు సమాచారం చేరడంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యం జరిగినట్లు బీసీసీఐ వర్గాల్లో చర్చ జరిగింది.
దీంతో కొన్ని సందర్భాల్లో సెలక్షన్ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ సమావేశాల్లోనే లక్ష్మణ్ పాల్గొనేలా బీసీసీఐ నిర్ణయించింది.
ఇప్పటికే గువాహటిలో జరిగిన టీ20, భారత్ 'ఏ' జట్ల ఎంపిక సమావేశానికి కూడా లక్ష్మణ్ హాజరయ్యారు.
వివరాలు
అగార్కర్ తర్వాత ఇదే తొలి భారత జట్టు
అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ప్రకటించిన తొలి భారత జట్టు ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చైర్మన్‌గా సెలక్షన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నాడు.
ఈజట్టు ఎంపికలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కింది.
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు.మరోవైపు ఆసియా క్రీడలకు గాయం కారణంగా దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు.
దీంతో అగార్కర్ నిష్క్రమణ తర్వాత జరిగిన తొలిజట్టు ఎంపికలోనే సెలక్షన్ కమిటీతో సీఓఈ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బీసీసీఐ కీలక మార్పు చేసింది.