IND vs SA: గువాహటి పిచ్ ఎలా ఉంటుందో? నిపుణుల విశ్లేషణ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా, దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. కోల్‌కతాలో స్పిన్‌కు విపరీతంగా సహకరించిన పిచ్‌పై అనూహ్యంగా ఓటమి చెందిన నేపథ్యంలో, గువాహటి బర్సాపారా స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అక్కడి పిచ్‌ను పరిశీలిస్తే ఈ మ్యాచ్ కూడా త్వరగానే ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఎర్రమట్టి పిచ్‌పై స్వల్పంగా పచ్చిక ఉన్నప్పటికీ, మ్యాచ్‌కు ముందు దానిని కత్తిరించే అవకాశముంది. పచ్చిక తొలగిస్తే పిచ్ స్పిన్‌కు మరింత సహకరిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎర్రమట్టి పిచ్‌లు సాధారణంగా త్వరగా పొడిబారుతూ పగుళ్లు ఏర్పడతాయి. ఆరంభ ఓవర్లలో బౌన్స్ ఎక్కువగా కనిపించవచ్చు. కానీ పిచ్ స్వభావం వేగంగా మారిపోవడంతో తర్వాత స్పిన్నర్లకే అనుకూలిస్తుంది.
Details
తొలిసారిగా టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం
బంతి బాగా తిరగడం, అస్థిర బౌన్స్‌తో బ్యాటర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పచ్చిక పూర్తిగా తొలగిస్తే, గువాహటి పిచ్ కూడ ఈడెన్ గార్డెన్స్ టెస్టు వేదికలానే మారవచ్చని భావిస్తున్నారు. మూడ్రోజుల్లో ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ముందు భారత జట్టు 124 పరుగుల ఛేదనలోనే కుప్పకూలి, 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్పిన్ పిచ్ కోరినందుకు చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, గువాహటి తొలిసారిగా టెస్టు మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వడం ప్రత్యేకం.
Details
పచ్చిక తీసేస్తే పిచ్ మారుతుందన్న బోథా అభిప్రాయం
దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ పీడ్ బోథా మాట్లాడుతూ, బర్సాపారా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, కానీ పచ్చిక కత్తిరిస్తే పిచ్ ప్రవర్తన మారిపోతుందని అన్నారు. గురువారం ఉదయం పిచ్‌ను చూశా. ఇంకా మ్యాచ్‌కు రెండు రోజులు ఉంది. పచ్చికను తొలగిస్తారా లేదా అంచనా వేయడం కష్టం. అయితే తొలగిస్తే పిచ్ స్పష్టంగా భిన్నంగా స్పందిస్తుందని తెలిపారు. క్రమంగా స్పిన్నర్లకు కూడా సహకారం లభిస్తుందని చెప్పారు. అలాగే గువాహటిలో మ్యాచ్ ఉదయం 9గంటలకే ప్రారంభం కావడంతో కొత్త బంతి తొలి గంటలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. వాతావరణం ఉదయం చల్లగా ఉంటుంది. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో కొత్త బంతి బ్యాటర్లను మరింత పరీక్షిస్తుందని బోథా వ్యాఖ్యానించారు.
Details
గిల్ దూరమైతే - సుదర్శన్‌కు అవకాశం ఎక్కువ!
శుభ్‌మన్ గిల్ ఆడలేకపోతే అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ మధ్య పోటీ ఉంది. ఇందులో సుదర్శనే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అయిదు టెస్టులు ఆడిన అతడు పెద్దగా రాణించకపోయినా, గత మ్యాచ్‌లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన సుదర్శన్‌కి ఈసారి జట్టులో అవకాశం వస్తే ఆరో స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే మూడో స్థానంలో ఇటీవల వాషింగ్టన్ సుందర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పిచ్‌పై పచ్చిక ఉంటే భారత్ నాలుగో స్పిన్నర్‌ను తప్పించే అవకాశం ఉండగా, అక్షర్ పటేల్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశముందని కూడా తెలుస్తోంది.