Pakistan sectarian violence: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు
పాకిస్థాన్ లో ముస్లింల మధ్య అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో సున్నీ-షియా వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో ఈ ఘర్షణలు చెలరేగాయి. అలీజాయ్-బగన్ వర్గాల మధ్య గత వారం ప్రారంభమైన ఈ హింసాత్మక సంఘటనలు శుక్ర, శనివారాల్లో మరింత ఉధృతమయ్యాయి, దీంతో 37 మంది మరణించగా, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, గురువారం కాన్వాయ్‌పై జరిగిన దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు.
ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధుల చొరవతో, షియా,సున్నీ వర్గాల పెద్దల మధ్య సమావేశం నిర్వహించగా, ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ, కుర్రం జిల్లాలో అక్కడక్కడా ఘర్షణలు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఘోజాగరి, మతాసానగర్, కుంజ్ అలీజాయ్ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు సమాచారం. కుర్రం డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ ప్రకారం, హంగూ,ఒరాక్జాయ్,కోహట్ జిల్లాలకు చెందిన మత పెద్దల సమక్షంలో శాంతి చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలకు కోహట్ కమిషనర్ నేతృత్వం వహించనున్నారని ఆయన తెలిపారు.
భూవివాదాలకు సంబంధించిన ఘర్షణలు
ఇదిలా ఉండగా, ఘర్షణల ప్రభావంతో పరాచినార్‌కు వెళ్లే రహదారులు మూసివేయబడటంతో, అక్కడ మందుల కొరత ఏర్పడినట్లు కుర్రం జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మీర్ హసన్ ఖాన్ వెల్లడించారు. సున్నీ ఆధిక్యం కలిగిన పాకిస్తాన్‌లో షియా ముస్లింలు సుమారు 15 శాతం జనాభాను కలిగివున్నారు. సాధారణంగా ఇరువర్గాలు శాంతియుతంగా జీవించినప్పటికీ, కుర్రం జిల్లాలో వివిధ కారణాలతో ఉద్రిక్తతలు తరచుగా చెలరేగుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఘర్షణల మూలం భూవివాదాలకు సంబంధించినదిగా తెలుస్తోంది.