జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు: అధికారులు అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లోని అధికారులు రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు.
దీంతో అప్రమత్తమైన యంత్రాంగం సమీప ప్రాంతాల్లోని 13,000 మంది నివాసితులను తాత్కాలికంగా తమ ఇళ్లను విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బాంబు పేలకుండా నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు జర్మన్ వార్తా సంస్థ డ్యుయిష్ వెల్లే తెలిపింది.
ఒక టన్ను బరువున్న ఈ షెల్ ఆగస్టు 7-8 తేదీల్లో, నగరంలోని జంతుప్రదర్శనశాల సమీపంలో కనుగొన్నట్లు అధికారులు చెప్పారు.
రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో మిగిలిపోయిన వేలాది బాంబులు ఇప్పటికీ జర్మనీ భూములలో నిక్షిప్తమై ఉన్నట్లు పేర్కొన్నారు.
జర్మనీ
డిసెంబర్ 2021లో పేలిన బాంబు
డ్యూసెల్డార్ఫ్‌లో బాంబు ఉన్న ప్రదేశానికి 500మీటర్ల దూరంలో ఉన్న నివాసితులందరినీ ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. ఆపరేషన్ సమయంలో సమీపంలోని రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు.
ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనే విషయాన్ని అధికారులు తెలియజేయలేదు. 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.4-టన్నుల బాంబును కనుగొనడంతో 65,000మంది ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు.
డిసెంబర్ 2021లో, మ్యూనిచ్ స్టేషన్ సమీపంలోని నిర్మాణ ప్రదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
స్మిత్సోనియన్ మ్యాగజైన్ ప్రకారం, 1940, 1945 మధ్య అమెరికన్, బ్రిటిష్ వైమానిక దళాలు యూరప్‌పై 2.7 మిలియన్ టన్నుల బాంబులను పడవేశాయి, వాటిలో సగం జర్మనీపైనే వేశాయి. అందులో కొన్ని అప్పుడు పేలలేదు. అవి కాలక్రమేనా భూమిలో ఉండిపోయాయి.