Loading...
California: హాలోవీన్ స్టోర్‌లో కాల్పులు.. గర్భిణి మృతి.. 17 ఏళ్ల యువకుడిపై కేసు
హాలోవీన్ స్టోర్‌లో కాల్పులు.. గర్భిణి మృతి.. 17 ఏళ్ల యువకుడిపై కేసు

California: హాలోవీన్ స్టోర్‌లో కాల్పులు.. గర్భిణి మృతి.. 17 ఏళ్ల యువకుడిపై కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హాలోవీన్ వస్తువులు విక్రయించే స్పిరిట్ హాలోవీన్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్ నగరంలో ఉన్న సోలానో టౌన్ సెంటర్ మాల్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మాల్‌లోని స్పిరిట్ హాలోవీన్ స్టోర్‌లోకి ప్రవేశించిన ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 31 ఏళ్ల కాన్‌స్టాన్స్ హేజెస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

ఒకరి పరిస్థితి విషమం.. నిలకడగా మరో ముగ్గురి పరిస్థితి

ఫెయిర్‌ఫీల్డ్ పోలీస్ విభాగం ప్రజా సమాచార అధికారి మిచెల్ బెలీయా తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు స్టోర్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడున్న ఓ కస్టమర్‌ను గుర్తించాడు.

అతడినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు.

గాయపడిన వారిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది.

మిగిలిన ఇద్దరికి చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

వివరాలు 

గతంలో జువెనైల్ నిర్బంధ కేంద్రంలో నిందితుడు

కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించారు.

ఫెయిర్‌ఫీల్డ్ సమీపంలోని సుయిసన్ సిటీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు మైనర్ కావడంతో అతడి పేరును పోలీసులు వెల్లడించలేదు.

మృతురాలు కాన్‌స్టాన్స్ హేజెస్ గర్భిణి కావడంతో నిందితుడిపై మరో హత్య అభియోగం కూడా మోపే అవకాశం ఉందని ఫెయిర్‌ఫీల్డ్ పోలీస్ చీఫ్ డాన్ మార్షల్ తెలిపారు.

నిందితుడు 2025లో ఓ కేసులో దోషిగా తేలి, కొన్ని నెలలపాటు జువెనైల్ నిర్బంధ కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం అతడు విడుదలయ్యాడని తెలిపారు. యువ నేరస్థుల విషయంలో కాలిఫోర్నియా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోలీస్ చీఫ్ డాన్ మార్షల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ADVERTISEMENT