Thailand's Songkran festival: థాయ్‌లాండ్‌లో 'సోంగ్‌క్రాన్' పండుగలో ఘోర విషాదం.. వారం రోజుల్లోనే 191 మంది మృతి..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నీటి పోరాట వేడుకగా గుర్తింపు పొందిన 'సోంగ్‌క్రాన్' ఈసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాధారణంగా పంటల కోతల అనంతరం ఏప్రిల్ మధ్యలో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ, ఈసారి మాత్రం ఆందోళనకు కారణమైంది. గత వారం రోజులుగా కొనసాగుతున్న వేడుకల్లో ఇప్పటివరకు 191 మంది ప్రాణాలు కోల్పోగా, 951కి పైగా రహదారి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇంకా వందలాది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ సమయంలో బ్యాంకాక్ వంటి ప్రధాన నగరాల్లో నివసించే లక్షలాది మంది తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు.
వివరాలు
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 27.4 శాతం ప్రమాదాలు
ఈ భారీ ప్రయాణాల వల్ల రహదారులపై రద్దీ పెరిగి ప్రమాదాల సంఖ్య గణనీయంగా అధికమవుతుంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజుల కాలాన్ని స్థానికులు "ఏడు ప్రమాదకర రోజులు"గా పిలుస్తుంటారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, నమోదైన ప్రమాదాల్లో 42 శాతం అతివేగం కారణంగా జరిగాయి.
అదేవిధంగా 27.4 శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించాయి.
హెల్మెట్ ధరించకపోవడం వంటి నిర్లక్ష్య ధోరణులు కూడా మరణాలకు దారితీస్తున్నాయి.
డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ విభాగం తెలిపిన గణాంకాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు నమోదవుతున్నాయి.
వివరాలు
'సంక్రాంతి'నుంచి సోంగ్‌క్రాన్
ప్రభుత్వం ప్రతి సంవత్సరం భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, కఠిన నియమాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రమాదాలను పూర్తిగా అరికట్టలేకపోతోంది.అయితే ఈ వేడుకల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం వస్తుంది.
ఈ ఏడాది సుమారు ఐదులక్షల మంది విదేశీ పర్యాటకులు ఈ వేడుకలను వీక్షించేందుకు రానున్నారని, దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 940మిలియన్ డాలర్ల ఆదాయం లభించనుందని అంచనాలు ఉన్నాయి.
సోంగ్‌క్రాన్ అనే పదం సంస్కృతంలోని'సంక్రాంతి'నుంచి వచ్చింది.సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని ఇది సూచిస్తుంది.
గత ఏడాది పాపాలను కడిగివేసి కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు నీటిని చల్లుకోవడం ఈ పండుగలో ప్రధాన సంప్రదాయం.
ఇంతటి సాంస్కృతిక విలువ కలిగిన ఈపండుగ ప్రతిసంవత్సరం వందలాది ప్రాణాలను బలి తీసుకుంటుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.