New York Street: న్యూయార్క్ బ్రూక్లిన్‌లో కాల్పులు.. 7 నెలల చిన్నారి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని న్యూయార్క్ సిటీ పరిధిలోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ వీధి మలుపు వద్ద గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఘటన సమయంలో ఓ వ్యక్తి మోపెడ్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న నిందితుడు ఫుట్‌పాత్‌పై గుంపుగా ఉన్న జనంపై లక్ష్యంగా రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఈ ఘటన గ్యాంగ్ దాడిగా అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. చక్రాల బండిలో (స్ట్రోలర్) ఉన్న అమాయక చిన్నారి ఈ కాల్పుల్లో బలైందని తెలిపారు. అదృష్టవశాత్తూ ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.
వివరాలు
ఘటనపై స్పందించిన జొహ్రాన్ మమ్దానీ
కాల్పుల అనంతరం నిందితులు మోపెడ్‌పై వేగంగా పారిపోతుండగా కొంత దూరం వెళ్లిన తర్వాత ఎదురుగా వచ్చిన కారును ఢీకొని కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్పందించిన జొహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపే మాటలు కూడా దొరకడం లేదని, తుపాకుల సంస్కృతిని అరికట్టేందుకు ఇంకా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.