Online Gambling: శ్రీలంకలో అక్రమ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్.. 8 మంది భారతీయుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక రాజధాని కొలంబోలో అక్రమంగా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఎనిమిది మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారులోని తలవతుగోడ ప్రాంతంలోని ఓ నివాసం నుంచి ఈ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తలంగమ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ చర్య చేపట్టారు. కడువెల మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు.. సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిబ్బంది సహకారంతో సంబంధిత నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారంతా భారతీయ పౌరులేనని పోలీసులు తెలిపారు. వారి వయసు 22 నుంచి 51 ఏళ్ల మధ్య ఉన్నట్లు వెల్లడించారు.
వివరాలు
భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో ఆ నివాసం నుంచి ఆరు కంప్యూటర్లు,39 మొబైల్ ఫోన్లు,పెద్ద సంఖ్యలో కంప్యూటర్ యాక్సెసరీలను స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాల నిర్వహణకు ఈ పరికరాలను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విదేశీయులు నిర్వహిస్తున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై శ్రీలంక అధికారులు ఇటీవల దృష్టి సారించారు.
ఇలాంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
తాజాగా ఎనిమిది మంది భారతీయుల అరెస్టు కూడా ఈ చర్యల్లో భాగమేనని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఈ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
దీని వెనుక మరెవరైనా ఉన్నారా? ఇతర ప్రాంతాలకు కూడా ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలు విస్తరించాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.