Loading...
Balochistan Liberation Front: పాకిస్థాన్ సైన్యంపై బీఎల్ఎఫ్ మెరుపు దాడులు.. 80 మంది హతమైనట్లు ప్రకటన
పాకిస్థాన్ సైన్యంపై బీఎల్ఎఫ్ మెరుపు దాడులు.. 80 మంది హతమైనట్లు ప్రకటన

Balochistan Liberation Front: పాకిస్థాన్ సైన్యంపై బీఎల్ఎఫ్ మెరుపు దాడులు.. 80 మంది హతమైనట్లు ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైనిక బలగాలపై భారీ దాడి చేసినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రకటించింది. గ్వాదర్ జిల్లాలో చేపట్టిన 'ఆపరేషన్ అల్మాస్'లో భాగంగా 80 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు, నిఘా విభాగాలకు చెందిన అధికారులను హతమార్చినట్లు పేర్కొంది. అయితే, ఈ మరణాల సంఖ్యపై ఇప్పటి వరకు స్వతంత్రంగా ధ్రువీకరణ అందలేదు. బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి మేజర్ గ్వారమ్ బలోచ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 22న ఆపరేషన్ ప్రారంభమైంది. గ్వాదర్‌లోని ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌డబ్ల్యూఓ) క్యాంపు ప్రధాన ద్వారం వద్ద ఆత్మాహుతి దాడి చేసిన అనంతరం తమ సాయుధులు శిబిరంలోకి ప్రవేశించినట్లు సంస్థ వెల్లడించింది.

వివరాలు 

రెండు సైనిక వాహనాలు ధ్వంసం

ఆ తర్వాత అక్కడ ఉన్న మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ), ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపింది.

ఈ దాడుల్లో ఎంఐకి చెందిన ఓ కెప్టెన్‌తో పాటు పలువురు అధికారులు, సైనికులు మరణించినట్లు పేర్కొంది.

తమ దాడులను అడ్డుకునేందుకు పాకిస్థాన్ సైన్యం చేసిన ప్రయత్నాలను విఫలం చేశామని బీఎల్ఎఫ్ ప్రకటించింది.

ఈ క్రమంలో రెండు సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

అయితే, ఈ ఘటనకు సంబంధించిన నష్టంపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

వివరాలు 

ఇవి బీఎల్ఎఫ్ చేసిన వాదనలు మాత్రమే, స్వతంత్ర ధ్రువీకరణ లేదని వెల్లడి

అభివృద్ధి పేరుతో పాకిస్థాన్ సైన్యం బలోచ్ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకుంటోందని మేజర్ గ్వారమ్ బలోచ్ ఆరోపించారు.

స్థానిక బలోచ్ ప్రజల అనుమతి లేకుండా చేపట్టే ప్రాజెక్టులను తాము లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) వంటి ప్రాజెక్టులు కూడా తమ హెచ్చరిక పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.

అయితే, ఈ దాడుల్లో 80 మందికి పైగా మరణించారన్న సమాచారం బీఎల్ఎఫ్ విడుదల చేసిన ప్రకటనపైనే ఆధారపడి ఉంది.

మరణాల సంఖ్య, దాడుల తీవ్రత, ఇతర వివరాలను పాకిస్థాన్ ప్రభుత్వం లేదా స్వతంత్ర వర్గాలు ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

దీంతో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.

ADVERTISEMENT