Loading...
9/11 aftermath: ట్విన్‌ టవర్స్‌ కూలిన తర్వాత నెలల తరబడి గాల్లో క్యాన్సర్‌ కారకాలు.. 9/11 పత్రాల్లో కీలక విషయాలు
9/11 పత్రాల్లో కీలక విషయాలు

9/11 aftermath: ట్విన్‌ టవర్స్‌ కూలిన తర్వాత నెలల తరబడి గాల్లో క్యాన్సర్‌ కారకాలు.. 9/11 పత్రాల్లో కీలక విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

9/11 అనే మాట అమెరికాలోని న్యూయార్క్‌ వాసులను ఇప్పటికీ కలచివేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (World Trade Center) ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రవాదులు దాడి (9/11 Attacks) చేసి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి భీకర దాడికి సంబంధించిన పలు పత్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు న్యూయార్క్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. అందులో కొన్ని పత్రాలను 'ది న్యూయార్క్‌ టైమ్స్‌' పరిశీలించగా.. అప్పట్లో నెలకొన్న గాలి కాలుష్యానికి సంబంధించి కీలక అంశాలు బయటపడ్డాయి. ట్విన్‌ టవర్స్‌ కూలిపోయిన కొన్ని నెలల తర్వాత కూడా అక్కడి గాలిలో ఆరోగ్యానికి హాని చేసే, క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నట్లు ఈ రికార్డులు సూచిస్తున్నాయి.

వివరాలు 

విమానాలను హైజాక్‌ చేసి.. టవర్లపై దాడి

2001 సెప్టెంబరు 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాలను హైజాక్‌ చేసి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట టవర్లను (Attack on WTC Twin Towers) ఢీకొట్టించారు.

ఈ దాడుల కారణంగా టవర్లు కుప్పకూలడంతో దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

భారీగా చెలరేగిన మంటల నుంచి వెలువడిన పొగ న్యూయార్క్‌ నగరాన్ని కమ్మేసింది.

దీంతో ప్రమాదకరమైన విషవాయువులు, కాలుష్య కారకాలు గాలిలో కలిసినట్లు పలు వివరాలు వెల్లడించాయి.

అయితే గాలిలో ప్రమాదకర కాలుష్యం ఉన్నప్పటికీ.. అధికారులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తాజాగా బయటపడిన పత్రాలు చెబుతున్నాయి.

గాలి నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ స్థానిక వ్యాపార సంస్థలను తెరిచేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి.

వివరాలు 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

9/11 దాడుల అనంతరం అక్కడి గాలి, దుమ్ము, శిథిలాల ప్రభావానికి గురైన పలువురిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు గతంలో అనేక నివేదికలు పేర్కొన్నాయి.

ఊపిరితిత్తులు, రక్తానికి సంబంధించిన క్యాన్సర్‌తో పాటు గుండె, శ్వాసకోశ సమస్యలు కూడా పలువురిని వేధించినట్లు వెల్లడైంది.

ఇలాంటి అనారోగ్య కారణాలతో కొందరు మరణించినట్లు కూడా సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

10 నెలల తర్వాత దుమ్ము నమూనాల సేకరణ

దాడి జరిగిన సుమారు పది నెలల అనంతరం.. 2002 జులైలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సమీపంలోని శిథిలాల ప్రాంతం నుంచి కొందరు అధ్యయనకారులు దుమ్ము నమూనాలను సేకరించారు.

వాటిని శాస్త్రీయంగా పరీక్షించగా.. క్యాన్సర్‌ కారకంగా పరిగణించే ఆస్బెస్టాస్‌ రేణువులు ఉన్నట్లు గుర్తించారు.

నాటి వాయు కాలుష్యం, దుమ్ము, పరిసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం 1.70 లక్షల పేజీల నివేదికల్లో నమోదు చేశారు.

ఈ భారీ స్థాయి పత్రాలను న్యూయార్క్‌ సిటీ కార్యాలయంలోని 68 పెట్టెల్లో దశాబ్దాలుగా భద్రపరిచారు.

ADVERTISEMENT

వివరాలు 

పత్రాల విడుదలకు కొన్నేళ్లుగా డిమాండ్లు

9/11 దాడుల తర్వాత గాలి నిజంగా సురక్షితంగా ఉందా? అనే అంశంపై ఈ పత్రాలు కీలక ఆధారాలను అందించవచ్చని భావిస్తున్నారు.

రికార్డులను బహిర్గతం చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ అంశంపై '9/11 హెల్త్‌వాచ్‌' అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది.

దాడి అనంతరం గాలి సురక్షితంగా లేదని నిరూపించగలిగితే.. బాధిత కుటుంబాలకు పరిహారం పొందే అవకాశాలు పెరుగుతాయని ఆ సంస్థ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

ఈ వారంలోనే ఈ రికార్డులు బహిర్గతం కానున్నాయి.

వివరాలు 

'పారదర్శకత, జవాబుదారీతనమే అందిస్తా': మమ్దానీ

9/11 ఘటనతో అనేక మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయని మమ్దానీ పేర్కొన్నారు.

''ఆ భయానక ఘటనతో ఎన్నో జీవితాలు తారుమారయ్యాయి. వారందరికీ నేను చేయగలిగింది ఒక్కటే. పారదర్శకత, జవాబుదారీతనాన్ని అందించడం'' అని ఆయన అన్నారు.

ADVERTISEMENT