LOADING...
Jeffrey Epstein: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్.. రహస్యంగా గ్యాలరీ ఏర్పాటు
ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్.. రహస్యంగా గ్యాలరీ ఏర్పాటు

Jeffrey Epstein: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్.. రహస్యంగా గ్యాలరీ ఏర్పాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన ఫైళ్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రత్యేకంగా ఒక రీడింగ్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నగర సమీపంలోని ట్రైబెకా ప్రాంతంలో ఈ ఫైళ్లను ప్రదర్శనకు ఉంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మే 8 నుంచి 21 వరకు ప్రజలు వీటిని చదివే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన సుమారు 3.5 మిలియన్ల ఫైళ్లను అమెరికా న్యాయశాఖ ఇప్పటికే దశలవారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రైమరీ ఫ్యాక్ట్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది.

వివరాలు

ప్రజలకు అందుబాటులో పత్రాలు

మొత్తం 3,700 వాల్యూమ్స్‌లో 'డొనాల్డ్ జె. ట్రంప్ అండ్ జెఫ్రీ ఎప్‌స్టీన్ మెమోరియల్ రీడింగ్ రూమ్' పేరుతో ఈ పత్రాలను అందుబాటులో ఉంచారు. అయితే అపాయింట్‌మెంట్ తీసుకున్న వారికి మాత్రమే ఈ రీడింగ్ రూమ్‌లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా గ్యాలరీ చిరునామాను నిర్వాహకులు రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఎగ్జిబిషన్‌లో ట్రంప్‌, ఎప్‌స్టీన్‌ల మధ్య సంబంధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎంతకాలం కొనసాగాయన్న అంశాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎప్‌స్టీన్ వర్గం చేసిన నేరాలు, వాటిని కప్పిపుచ్చేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల నుంచి ప్రజల దృష్టి మరలకుండా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎన్జీఓ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Advertisement