Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!
కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదానికి ప్రధాన కారణం పడవలోని ప్రయాణికుల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోవడం అని అధికారులు వివరించారు. ఫెర్రీ బోటులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. వారు క్రిస్మస్ వేడుకల కోసం తమ సొంతూళ్లకు తిరిగి వెళ్ళిపోతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
గల్లంతైన వారిలో ఇప్పటివరకు 20 మందిని రక్షించగలిగారు. కానీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి, బోటు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల, నాలుగు రోజుల క్రితం కూడా మరో ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతి సమయంలో పడవ నిర్వహణకు హెచ్చరికలు జారీ చేస్తుండగా, కొంతమంది వాటిని పట్టించుకోకుండా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది.