Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. ఖండించిన ఇస్కాన్
బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) తీవ్రంగా స్పందించింది. ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్ దాస్ ట్విట్టర్ వేదికగా ''రమణ్ రాయ్ గారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయండి'' అని విజ్ఞప్తి చేశారు. ''అతని తప్పు ఏమిటంటే, చిన్మయ్ కృష్ణ దాస్ కోసం న్యాయస్థానంలో వాదించడం మాత్రమే. ఈ కారణంగా ముస్లిం వర్గాలు అతని ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో కొట్టుకుంటున్నారు'' అని రాధారమణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
చిన్మయ్ కృష్ణ దాస్ పై దేశద్రోహం కేసు నమోదు
ఈ ఘటనపై బంగ్లాదేశ్‌లోని పలువురు న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గత నెలలో చిన్మయ్ కృష్ణ తరపు లాయర్ హత్యకు గురయ్యాడని కొన్ని వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా హత్యకు గురైన న్యాయవాది పేరు సైఫుల్ ఇస్లాం అని, ఆయన ప్రభుత్వ తరఫున పనిచేస్తున్న లాయర్ అని తేలింది. ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్, ఇటీవల రంగ్‌పూర్ ప్రాంతంలో హిందువుల హక్కుల కోసం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఘటనల అనంతరం ఢాకా పోలీసులు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానం ఆయనకు బెయిల్ నిరాకరించింది.
చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యుల అదృశ్యం
ఇదే సమయంలో, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై కూడా ఇస్కాన్ స్పందించింది. ఛటోగ్రామ్ ప్రాంతానికి చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులలో ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల సాగుతున్న ఈ హింసాత్మక పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.