భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్ ప్రకటన.. కారణం ఇదే..
అఫ్ఘానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది. తమకు భారత ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో సహకారం అందట్లేదని, ఈ క్రమంలోనే తమ రాయబార సేవల్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలతో పాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అన్ని రకాలుగా ఆలోచించాకే దౌత్యపరమైన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అప్ఘాన్ పట్ల భారత్ ఆసక్తి చూపట్లేదని, రాయబార కార్యాలయంలోని సిబ్బంది, వనరులను తగ్గించిందని చెప్పింది.
భారత్‌లో అఫ్ఘాన్ రాయబారిగా ఫరీద్ మముంద్‌జాయ్
ఈ క్రమంలోనే దిల్లీలో అప్ఘాన్ కార్యకలాపాలు కొనసాగించడంలో ఇక్కట్లు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చింది. తమకు మరోదారి లేక ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. భారత్‌కే అధికారాన్ని అప్పగించే వరకు అఫ్ఘాన్ పౌరులకు అత్యవసర కౌన్సిల్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. దౌత్య సంబంధాలపై 1961లో జరిగిన వియన్నా కన్వెన్షన్ కు సంబంధించి ఆర్టికల్ 45 మేరకు రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశ సంరక్షక అధికారానికి బదిలీ చేయాలి. ప్రస్తుతం భారత్‌లో అఫ్ఘాన్ రాయబారిగా ఫరీద్ మముంద్‌జాయ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించకముందు అష్రఫ్ ఘనీ సర్కార్ ఫరీద్ ను నియమించింది. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ పరిపాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.