ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంలో భాగంగానే బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. మహిళలు నిర్వహించే బ్యూటీ సంస్థలను తప్పనిసరిగా మూసివేయాలని తాలిబాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని అని కూడా ప్రభుత్వం పేర్కొంది. తాలిబాన్ ప్రభుత్వం బ్యూటీ సెలూన్లపై నిషేధం గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
వేలాదిమంది మేకప్ ఆర్టిస్టులపై ప్రభావితం: మహిళా కార్యకర్త జమీలా
బ్యూటీ సెలూన్లను మూసివేసిన తర్వాత బ్యూటీషన్ల ఉపాధికి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై తాలిబాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ మహిళా హక్కుల కార్యకర్త జమీలా స్పందించారు. ఇది వేలాది మంది మేకప్ ఆర్టిస్టులను ప్రభావితం చేస్తుందని చెప్పారు. తాలిబన్లు స్త్రీలను మనుషులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయి టర్కీలో నివసిస్తోంది. 1996నుంచి 2001 వరకు పాలించిన తాలిబన్లు అప్పుడు కూడా బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించారు.