Loading...
Canada: కెనడాలో వర్క్ పర్మిట్లపై కఠిన నిబంధనలు.. అంతర్జాతీయ విద్యార్థులకు కీలక హెచ్చరిక
అంతర్జాతీయ విద్యార్థులకు కీలక హెచ్చరిక

Canada: కెనడాలో వర్క్ పర్మిట్లపై కఠిన నిబంధనలు.. అంతర్జాతీయ విద్యార్థులకు కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థులతో పాటు పలువురు అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు (PGWP) తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వర్క్ పర్మిట్ దరఖాస్తులు తిరస్కరించబడటానికి నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనలు చేపట్టగా, ఈ అంశంపై ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) స్పందించింది. చదువుకునే సమయంలో ఉద్యోగాలు చేసే విద్యార్థులు తప్పనిసరిగా అమల్లో ఉన్న నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. స్టడీ పర్మిట్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ఉద్యోగాలు చేయడం కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాలకు విరుద్ధమని ఐఆర్‌సీసీ తెలిపింది.

వివరాలు 

పోర్టేజ్ కాలేజ్ విద్యార్థుల వర్క్ పర్మిట్ దరఖాస్తులు తిరస్కరణ

పార్ట్‌టైమ్ ఉద్యోగమైనా, పూర్తి సమయ ఉద్యోగమైనా అధికారిక అనుమతి లేకుండా పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భవిష్యత్తులో వర్క్ పర్మిట్లను తిరస్కరించడం, వీసా దరఖాస్తులను నిరాకరించడం, అవసరమైతే దేశం నుంచి వెనక్కి పంపించడం వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇటీవల కెనడాలోని పోర్టేజ్ కాలేజ్'కు చెందిన పలువురు విద్యార్థుల వర్క్ పర్మిట్ దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ పరిణామాలపై స్పందించిన కళాశాల యాజమాన్యం, విద్యార్థులు న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించింది.

అలాగే విద్యార్థుల ప్రతినిధులతో త్వరలో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తామని వెల్లడించింది.

వివరాలు 

అనుమతి లేని ఉద్యోగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక

ఇక విదేశీ విద్యార్థుల ప్రవేశాలు, వర్క్ పర్మిట్ నిబంధనలపై కెనడా ప్రభుత్వం ఇటీవల మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది.

ఈ మార్పుల ప్రభావం వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై పడే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

అనధికారిక ఏజెంట్లు లేదా ప్రభుత్వ గుర్తింపు లేని విద్యాసంస్థల ద్వారా వర్క్ పర్మిట్ పొందేందుకు ప్రయత్నించవద్దని ఐఆర్‌సీసీ మరోసారి స్పష్టం చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు మార్గాలను అనుసరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

విద్యార్థులు అధికారిక గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని, వర్క్ పర్మిట్ కోసం నిర్దేశించిన అధికారిక ప్రక్రియలను మాత్రమే అనుసరించాలని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఉన్నత విద్య కోసం భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు కెనడాకు

ఇటీవలి కాలంలో ఇలాంటి ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ అడ్వైజరీని జారీ చేసినట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది.

ప్రతి ఏడాది ఉన్నత విద్య కోసం భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్తున్నారు.

అయితే కొందరు అనధికారిక ఏజెంట్లు, నకిలీ విద్యాసంస్థల మోసాలకు గురై నిబంధనలకు విరుద్ధంగా వర్క్ పర్మిట్ పొందేందుకు ప్రయత్నించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.

కెనడాలో అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉండటంతో తాజా హెచ్చరికలు వారిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

ADVERTISEMENT